ఆర్తనాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్తనాదం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

ఆసరా కోసం
రెండేళ్లయినా కొత్త పింఛన్లకు దిక్కులేదు జిల్లాలో 50 వేల మంది ఎదురుచూపులు కనికరించని చంద్రబాబు ప్రభుత్వం

కదలలేని భర్త..

కరగని ప్రభుత్వం

వైఎస్సార్‌సీపీ హయాంలోనే మెరుగైన వ్యవస్థ

త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులను గుర్తించి జాబితాలు ప్రకటించేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వేకువజామునే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి మరీ చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. ఐదేళ్ల కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పింఛన్లు అందించిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికే దక్కిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత 23 నెలలుగా ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు.

జిల్లాలో మొత్తం దివ్యాంగ

పింఛన్‌దారులు

పింఛన్‌ వస్తేనే

బతకగలను

నేను పుట్టుకతోనే అంధురాలిని. రెండు కళ్లు కనిపించవు. ఇతరుల సహాయం లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నాది. ఎవరైనా సాయం చేస్తేనే బతుకుబండి నడుస్తుంది. పింఛన్‌ కోసం సచివాలయానికి, పీజీఆర్‌ఎస్‌కు ఎన్నోసార్లు అతి కష్టం మీద వెళ్లి దరఖాస్తు చేసుకున్నాను. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మళ్లీ రమ్మని చెప్పి అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. నాకు వేరే ఎలాంటి ఆధారం లేదు. పింఛను వస్తేనే నా జీవితం సాగుతుంది. నాలాంటి అభాగ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– టి.హేమ, అంధ దివ్యాంగురాలు,

వాంబేకాలనీ, మధురవాడ

మంచానికే పరిమితమైన కొడుకు

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం మాది. సెంటు భూమి లేదు, కూలి పనులు చేద్దామన్నా వయసు సహకరించదు. మూడేళ్ల క్రితం వరకు మా కొడుకు లక్ష్మణే మాకు అన్నీ తానై చూసుకునేవాడు. కానీ కాలం మాపై పగబట్టింది. ఒక ప్రమాదం.. ఆపై వింత వ్యాధి, పక్షవాతం మా కొడుకు జీవితాన్ని ఛిద్రం చేశాయి. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. 2024లోనే 50 శాతం అంగవైకల్యంతో సదరం సర్టిఫికెట్‌ వచ్చింది. అప్పుడే పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాం. ఎన్నికలు వచ్చాయని ఆపారు.. ఆ తర్వాత ప్రభుత్వం మారింది కానీ, మా తలరాత మారలేదు. రెండేళ్లుగా పింఛన్‌ కోసం తిరగని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. రేపు మేం కళ్లు మూస్తే.. మంచం మీద ఉన్న మా కొడుకు గతి ఏంటన్నదే మా భయం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మా కొడుకుకు పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలి.

– బండి అప్పారావు, కనకరత్నం రేవిడి గ్రామం,

పద్మనాభం మండలం (బాధిత తల్లిదండ్రులు)

మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవుతున్నా.. రాష్ట్రంలో కొత్త పింఛన్ల ఊసే లేదు. ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన వారికి, వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు తక్షణమే పింఛన్లు ఇస్తామని ప్రచార సభల్లో చంద్రబాబు పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. కానీ, అధికారం చేపట్టి 23 నెలలవుతున్నా.. ఎంతో మంది అర్హులు ఉన్నా.. నేటికీ ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలు ఆశ నిరాశల మధ్య నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయంటూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. తమ ఇంటి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా చక్కర్లు కొడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఆన్‌లైన్‌లో సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది.

కోతలపైనే చంద్రబాబు సర్కార్‌ దృష్టి

అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికారు. కానీ, కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను పూర్తిగా అటకెక్కించారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో అధికారులకే స్పష్టత లేని దయనీయ పరిస్థితి నెలకొంది. ‘ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే అర్హుల జాబితాలను పంపుతామని, అంతవరకు మేమేమీ చేయలేమని’ క్షేత్రస్థాయి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఒకపక్క కొత్త పింఛన్ల ఊసే లేదు, మరోపక్క ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏ పనీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు కూటమి సర్కార్‌ తీరని అన్యాయం చేస్తోంది. రీ–వెరిఫికేషన్‌ పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదించే చర్యలకు తెరతీయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement