14వ తేదీన నవ వధువు మృతి
నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన తల్లి
కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
తల్లీకూతుళ్లు మృతి చెందడంతో
విషాదంలో కుటుంబం
అగనంపూడి: ఆ ఇంట పెళ్లి బాజాలు మోగి ఇంకా 24 గంటలు కూడా గడవలేదు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవవధువు కళ్లల్లో వేనవేల ఆశలు.. పుట్టింటి వారి ఆశీస్సులు, అత్తారింటి వారి ఆదరణతో మురిసిపోతున్న వేళ.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పచ్చని సంసారంలో తీరని నిప్పులు పోసింది. వివాహం జరిగిన మరుసటి రోజే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె తల్లి కూడా ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడబిడ్డలు అనంతలోకాలకు వెళ్లడంతో ఆ గ్రామం కన్నీటి సముద్రమైంది. మృతురాలి సోద రుడు పలకా రాము తెలిపిన వివరాల ప్రకారం.. అగనంపూడి కొండయ్యవలసకు చెందిన రామేశ్వరి (31)కి, పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుతో ఈ నెల 13న వైభవంగా వివాహం జరిగింది. 14వ తేదీ సాయంత్రం వధువు పుట్టింటికి కారులో బయలుదేరింది. మరికొద్ది నిమిషాల్లో కన్నవారి ఇల్లు చేరుకుంటారనగా, అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు సమీపంలో కారు నడుపుతున్న భర్త నరసింగరావు ఒక్కక్షణం అలసటతో కళ్లు మూశాడు. అంతే.. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ హృదయవిదారక ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న నవవధువు రామేశ్వరి పెళ్లి పట్టుచీరలోనే అక్కడికక్కడే మృతిచెందింది. కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో గుండె పగిలేలా రోదించిన తల్లి కనకమహాలక్ష్మి (51) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. ప్రమాదంలో గాయపడిన మరో కుమార్తె వరలక్ష్మి, అల్లుడు నరసింగరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీకూతుళ్ల మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


