అల్లిపురం: శాంతిభద్రతల పరిరక్షణలో లాఠీ పట్టి రౌడీల గుండెల్లో వణుకు పుట్టించే ఖాకీలు.. ఆపదలో ఉన్న అభాగ్యులను చూస్తే కరిగిపోతారని విశాఖ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ నిరూపించారు. తోటివారికి సాయం చేయడంలోనే పరమార్థం ఉందని నమ్మి, తనదైన శైలిలో ఉదారత చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.. హెడ్ కానిస్టేబుల్ సూరిశెట్టి జలఉష (పీసీ 2714). సమాజం గర్వించదగ్గ రీతిలో తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెందుర్తిలోని ‘శ్రీ మణిప్రకాష్ అనాథ ఆశ్రమం’ నిర్వాహకులు దొడ్డి ప్రకాష్ చేస్తున్న సేవలకు ముగ్ధురాలైన జలఉష, ఆశ్రమానికి తన వంతుగా రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనాథల మధ్యే గడుపుతూ వారికి ఒక రోజు సేవకురాలిగా మారిపోయారు.
ఐదేళ్లుగా వీడని సేవా బంధం : ఈ సందర్భంగా జలఉష మాట్లాడుతూ.. ఆశ్రమంలో దాదాపు 250 మందికి పైగా అనాథలను, నిరాశ్రయులను, మానసిక వికలాంగులను చేరదీసి వారికి పునరావాసం కల్పిస్తూ చేస్తున్న సేవలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే ఐదేళ్లుగా ప్రతి ఏటా రూ. 5 వేల చొప్పున విరాళం ఇస్తూ వస్తున్నాను. ఈ ఏడాది రూ. 50 వేల ఆర్థిక సాయం అందించడం తృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, విధుల్లో భాగంగా నగరంలో ఎక్కడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులు, వృద్ధులు కనిపిస్తే పోలీసుల తరఫున ఈ ఆశ్రమానికే పంపిస్తామని, నిర్వాహకులు వారిని ఎల్లప్పుడూ ఆదరిస్తారన్నారు.


