మా బతుకులెలా? | - | Sakshi
Sakshi News home page

మా బతుకులెలా?

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

ప్రధాని పిలుపుతో స్వర్ణకారుల ఆవేదన

ఇప్పటికే ఆర్డర్లు తగ్గి

ఉపాధి కోల్పోయిన కార్మికులు

బంగారం దిగుమతిపై 10 శాతం

సుంకం విధింపుతో బెంబేలు

బంగారం కొనొద్దంటే..

డాబాగార్డెన్స్‌: ‘దేశ ఆర్థిక వ్యవస్థను, రూపాయి విలువను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’అంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు స్వర్ణకార వృత్తిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ‘జనాలు బంగారం కొనవద్దంటే మా ఉపాధి మాటేమిటి? మా కుటుంబాలను ఎవరు పోషిస్తారు?’అంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు చుక్కలనంటడం, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై 10 శాతం సుంకం విధించడంతో దేశీయంగా నగల వ్యాపారం తీవ్ర సంక్షోభంలో పడింది. తాజా పరిణామాలతో అసలు ఈ వృత్తి మనుగడలోనే ఉంటుందా అనే భయం వారిని వెంటాడుతోంది. కేవలం కార్మికులే కాకుండా, నగల వ్యాపారంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తమ భవిష్యత్తుపై తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాయి.

ఉపాధిపై భయాందోళనలు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 50 వేలకు పైగా కుటుంబాలు స్వర్ణకార వృత్తిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నాయి. పాతనగరంతో పాటు ద్వారకానగర్‌, కంచరపాలెం, ఎంవీపీ కాలనీ, గాజువాక, భీమిలి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఈ వృత్తిదారులు పెద్ద సంఖ్యలో కేంద్రీకృతమై ఉన్నారు. ఒక్క విశాఖ నగర పరిధిలోనే 30 వేల నుంచి 35 వేల కుటుంబాలు ఈ రంగంలో ఉన్నాయి. వీరిలో పాతబస్తీలోనే 15 నుంచి 20 వేల మంది జీవనం సాగిస్తున్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వృత్తిదారులు 6 నుంచి 7 వేల మంది వరకు ఉండగా, ముస్లిం వర్గానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ రంగం కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక వృత్తిదారులకు పనులు దొరకడం గగనమైపోయింది. ఉపాధి కోల్పోయిన చాలా మంది ఇప్పటికే ఇతర రంగాల వైపు మళ్లగా, మిగిలిన వారు ప్రధాని తాజా వ్యాఖ్యలతో పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కార్పొరేట్‌ తాకిడి.. పెరిగిన పన్నుల భారం

గత పదేళ్లుగా చిన్న తరహా బంగారు ఆభరణాల వ్యాపారం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. స్థానిక దుకాణాల వ్యాపారమంతా కార్పొరేట్‌ షోరూమ్‌ల వైపు మళ్లింది. ఒకప్పుడు బంగారు నగల వ్యాపారానికి గుండెకాయ లాంటి పాతనగరంలో ఇప్పుడు స్వర్ణకారులు పనుల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు ఆశించగా, కొనుగోళ్లు ఆపాలని ప్రధాని చెప్పడం కోలుకోలేని దెబ్బ తీసిందని వృత్తిదారులు వాపోతున్నారు.

ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలి

రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిదారులు పనులు లేక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. ధరలు పెరిగి వ్యాపారాలు మందగించిన తరుణంలో, ప్రధాని మోదీనే ఏడాది పాటు ఆభరణాలు కొనవద్దని చెబితే ఈ రంగంపై ఆధారపడిన సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఒకవైపు దిగుమతి సుంకం పెంచారు. మరోవైపు జీఎస్టీ భారం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కార్పొరేట్‌ షోరూంల పోటీతో ఇప్పటికే సతమతమవుతున్న స్వర్ణకారులకు ప్రధాని ప్రకటన ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు’తయారైంది. గతంలో కార్మికులకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం అందడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలి.

– గురజాపు రవి, అధ్యక్షుడు, విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం

రోడ్డున పడకుండా చూడండి

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల బంగారు నగల విక్రయాలు పూర్తిగా పడిపోతున్నాయి. కొనేవారు లేక వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా నగలు కొనవద్దంటే మా లాంటి పేద కార్మికులు ఏమైపోవాలి? ఒకప్పుడు నగల తయారీ కోసం ప్రజలు నేరుగా స్వర్ణకారుల వద్దకే వచ్చేవారు. కానీ కార్పొరేట్‌ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనల వల్ల మా వద్దకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు పన్నుల భారం, ప్రభుత్వ ఆంక్షల వల్ల మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మా వృత్తిని కాపాడాలి.

– పక్కి కొండబాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర స్వర్ణకార సంఘం

Advertisement
 
Advertisement
Advertisement