1875వ రోజుకు చేరిన ‘ఉక్కు’ దీక్షలు | - | Sakshi
Sakshi News home page

1875వ రోజుకు చేరిన ‘ఉక్కు’ దీక్షలు

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

బీచ్‌రోడ్డు: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించాలని, అలాగే ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) అధ్యక్షుడు యు.రామస్వామి డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణకై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1875వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్లు ఎక్కడా స్పష్టం చేయలేదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న గనులను అభివృద్ధి పేరుతో జిందాల్‌ సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్ల టన్నుకు ఐదు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్లాంట్‌ ఉత్పత్తి పెరిగిందని చెబుతున్న ప్రభుత్వాలు, దానికి కారణమైన ఉద్యోగులకు నాలుగు నెలలకు పైగా వేతనాలు బకాయి పెట్టడం అత్యంత దారుణమన్నారు. ప్లాంట్‌లో పనిచేస్తున్న 6,000 మందికి పైగా కాంట్రాక్ట్‌ కార్మికులను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని, వారి ఆధార్‌ కార్డులను సైతం బ్లాక్‌ చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే ఆధార్‌ కార్డు బ్లాక్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. తొలగించిన వారి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి, వారికి ఎలాంటి హక్కులు, సౌకర్యాలు కల్పించకుండా కట్టు బానిసల్లా పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్వాసితులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో యూనియన్‌ నాయకులు శ్రీనివాసరాజు, ఇ. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement