బాంబ్‌ | - | Sakshi
Sakshi News home page

బాంబ్‌

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

సామాన్యుడి గుండెల్లో గుబులు

లీటరు పెట్రోల్‌పై రూ.3.29,

డీజిల్‌పై రూ.3.25 పెంపు

విశాఖలో రూ.111 దాటిన పెట్రోల్‌, రూ.99.47కు చేరిన డీజిల్‌

వాహనదారులపై నెలకు

రూ.10.72 కోట్ల అదనపు భారం

పెట్రో

మహారాణిపేట: గత కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై భారీ భారాన్ని మోపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, దేశీయ చమురు సంస్థల ఆర్థిక ఒత్తిడిని సాకుగా చూపుతూ ఇంధన ధరలను భారీగా పెంచేసింది. పెంచిన ధరలు (లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.25) శుక్రవారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి. 2022 ఏప్రిల్‌ తర్వాత ఇంధన ధరల్లో ఇంత పెద్ద మొత్తంలో మార్పులు రావడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 తగ్గించిన ప్రభుత్వం, తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మళ్లీ ధరల బాదుడుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.

పలు రంగాలపై ‘చమురు’ దెబ్బ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆమాంతం పెరగడంతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. లారీ యజమానులు ఇప్పటికే రవాణా ఛార్జీలను పెంచేశారు. ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణ ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నారు.

రవాణా రంగం: లారీలు, ఆటోల ఛార్జీల పెరుగుదల వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.

ఆర్టీసీ, మత్స్య రంగం: నిత్యం వేల లీటర్ల డీజిల్‌ వినియోగించే ఆర్టీసీ బస్సులపై, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని బోట్లపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బేరల్‌ ధరల సాకుతో చమురు సంస్థలు చేతులెత్తేస్తుండటంతో, సామాన్య వినియోగదారులు ఏం చేయాలో పాలుపోక గగ్గోలు పెడుతున్నారు.

తాజా ధరల వివరాలు (లీటరుకు)

పాత ధర కొత్త ధర

పెట్రోల్‌ రూ.108.45 రూ.111.74

డీజిల్‌ రూ.96.22 రూ.99.47

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల బహుమతి

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ధరలు పెంచడం ప్రజలను వంచించడమే. ఎన్నికల ముందే ఈ భారం వేసి ఉంటే బాగుండేది. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపై పడి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చేదైన బహుమతి.

– సాదదాసు సుధాకర్‌,

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి

పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. ఈ నిర్ణయం వల్ల లీటరుపై మూడు రూపాయలకు పైగా భారం పడటం అన్యాయం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి.

– మాజీ కన్వీనర్‌, నూర్‌ భాషా

దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం,

విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement