సింహగిరి బోర్డు నియామకాల్లో
పారదర్శకత శూన్యం
నిరాశలో కూటమి నేతలు..
మొండిచేయి చూపిన అధిష్టానం
అనర్హులకు అగ్రతాంబూలం..
బీజేపీ శ్రేణుల ఆగ్రహం
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు.
జగన్ హయాంలో పారదర్శకత
సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్‌బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్‌లో ట్రస్ట్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనర్హులకు పెద్దపీట
ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలేదని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు.
పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు
భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించలేదు.
అప్పన్న ట్రస్ట్ బోర్డు నియామక జీవో విడుదల
సింహాచల దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు అధ్యక్షుడిగా, మరో 16 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలి రెండేళ్లపాటు కొనసాగనుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన జాబితానే ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.
బీజేపీకి అవమానం
ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది.
–విజయశంకర్ ఫణీంద్ర,
బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్


