ఆటోలు లాగుతూ సీపీఎం నిరసన | - | Sakshi
Sakshi News home page

ఆటోలు లాగుతూ సీపీఎం నిరసన

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

డాబాగార్డెన్స్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ గురజాడ విగ్రహం వద్ద ఆటోను తాడుతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పొదుపు నాటకాలు ఆపాలని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సంక్షోభంపై అమెరికా ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యులను దొంగదెబ్బ తీశారని, ధరలు తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, జగదాంబ జోన్‌ కన్వీనర్‌ ఎం.సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బైక్‌లను తాడుతో లాగి సీపీఐ నిరసన

ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్‌లో ద్విచక్ర వాహనాలను తాడుతో లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే రహ్మాన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇస్తూ, సామాన్యులపై మాత్రం భారాలు మోపుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చే బహుమతులు ఇవేనా అని ప్రశ్నించారు. వ్యాపారవేత్తలకు తక్కువ ధరలకే భూములు కట్టబెడుతున్నారని, పెరిగిన పెట్రో ధరలతో నిత్యావసరాలు భగ్గుమంటాయని, ఈ పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అత్తిలి విమల, రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

పేదల పొట్ట కొట్టొద్దు: ఆటో ఫెడరేషన్‌ ఆగ్రహం

భారీగా పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆటో డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌గేట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలు కుమ్మకై ్క ప్రజలపై భారం మోపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 50 సార్లు ధరలు పెంచిందని, పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి దేశంలో ఇంధన ధరలు పెంచడం వల్ల రవాణా రంగం దెబ్బతిని ఆహార భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై తమ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement