మధురవాడ: అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా దోచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనువాసరావు (చిన్న శ్రీను) విమర్శించారు. శుక్రవారం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు బొట్టవానిపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు పోతిన హనుమంత రావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీడీపీకి చెందిన నమ్మి అప్పలరాజు, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మారికవలస నుంచి కొమ్మాది జంక్షన్, గణేష్‌నగర్ మీదుగా బొట్టవానిపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమంతరావు జన్మదినం సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. చిన్న శ్రీను మాట్లాడుతూ.. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను ఆరిలోవలో డేటా సెంటర్ పేరుతో అప్పగించడం దారుణమని, ఆ నరసింహస్వామి ఆగ్రహానికి వారు గురికాక తప్పదని హెచ్చరించారు. ఎంపీ భరత్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5వేల కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని విమర్శించారు. ‘త్రిశూలం’ పేరుతో రూ. 3 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దేవుడి పేరుతో కూడా దోపిడీకి వెనుకాడటం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు, ముఖ్యంగా యాదవులకు అన్ని రంగాల్లో పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీలో 50 మంది చేరిక : టీడీపీలో నుంచి వైఎస్సార్‌సీపీలోకి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో 50 మంది చేరారు. ఆయతో పాటు నమ్మి రమణ, నమ్మి నర్శింహులు, ఇయ్యపు రమేష్, పంచదార్ల శివకృష్ణ, బర్ల శ్రీను తదితరు 50మందికి నాయకులు పార్టీ కుండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానం పలికారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు, 5వ వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతురావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వివిధ విభాగాల నాయకులు వంకాయల మారుతీ ప్రసాద్, ముగడ రమణ, అక్కరమాని రామునాయుడు, పిళ్లా పాపారావు, చేకూరి రజని, జగ్గుపిల్లి నరేష్, తమ్మినేని వరలక్ష్మి, రామా రావు, అప్పన్న, పోతిన మూర్తిబాబు, బంగారు ప్రకాశ్, సూర్యప్రకాశరావు, శేషుబాబు పాల్గొన్నారు.


