తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా జీవీ ఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ భీమిలి, అనకాపల్లి ప్రాంతాల్లో సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణానికి తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గుర్తించిన మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సముద్ర జలాల ను శుద్ధి చేసి తాగునీటిగా మార్చే డీశాలినేషన్‌ ప్రాజెక్టుల అమలుపై ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ అంశాలపైనే ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై కమిషనర్‌ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య, జేడీ అమృత్‌, డి.విజయభారతి, వ్యయ పరిశీలకుడు వాసుదేవరెడ్డి, డీసీఆర్‌ శ్రీనివాసరావు, ప్రధాన ఇంజనీర్‌ సత్యనారాయణరాజు, జోనల్‌ కమిషనర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, వీఎంఆర్‌డీఏ చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement