కొనుగోలుదారుగా వచ్చి..
అల్లిపురం : నగరాన్ని షాక్‌కు గురిచేసిన కౌసల్య జ్యువెలరీ షాప్ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపులోకి వచ్చిన ఓ మహిళ, తన సహచరుడితో కలిసి 425 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన సినీ స్టైల్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి నిందితులను పట్టుకొని దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.
‘కూతురు పెళ్లి’ కథతో నమ్మించి..
వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఎం.సుధీందర్ నిర్వహిస్తున్న కౌసల్య జ్యువెలరీ షాప్‌నకు ఈ నెల 12న మధ్యాహ్నం ఒమ్మి మంగమ్మ అలియాస్ మంగా వచ్చింది. ఆమె షాపు యజమానికి పాత పరిచయమే. దీంతో ఎలాంటి అనుమానం రాలేదు. షాపులోకి వచ్చిన మంగా ‘కారులో నా బంధువు ఉన్నాడు. ఆయనకు శారీరక వైకల్యం ఉంది. లోపలికి రాలేడు. మా అమ్మాయి పెళ్లికి నగలు కొనాలి’ అంటూ భావోద్వేగ కథ అల్లింది. పలు రకాల బంగారు ఆభరణాలు చూపించమని కోరింది. కొన్ని డిజైన్లు ఎంపిక చేసిన తర్వాత ‘వాటిని కారులో ఉన్న బంధువుకు చూపించి వస్తాను’ అని చెప్పింది. ఆమైపె నమ్మకం ఉంచిన షాప్ యజమాని రెండు ట్రేల్లో సుమారు 425 గ్రాముల బంగారు ఆభరణాలను ఇచ్చాడు.
ఒక్క క్షణంలో ప్లాన్ అమలు
నగలు చేతికి అందుకున్న వెంటనే మంగా బయటకు వెళ్లి కారులో కూర్చుంది. అక్కడ ముందే సిద్ధంగా ఉన్న సహచరుడు దేవర రామకృష్ణతో కలిసి క్షణాల్లో అక్కడి నుంచి పరారైంది. ఏమి జరిగిందో అర్థం చేసుకునేలోపే భారీ చోరీ జరిగిపోయింది. షాక్‌కు గురైన షాప్ యజమాని వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు.
అసలు మాస్టర్‌ప్లాన్ ఇదే..
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో త్వరగా డబ్బు సంపాదించాలని భావించిన మంగం తరచూ వెళ్లే జ్యువెలరీ షాప్‌ను టార్గెట్‌గా ఎంచుకుంది. యజమాని నమ్మకాన్ని ఉపయోగించుకోవాలని ముందే నిర్ణయించింది. తన బంధువు రామకృష్ణను దివ్యాంగుడిగా కారులో కూర్చోబెట్టి డ్రామా ఆడింది. కూతురు పెళ్లి పేరుతో యజమాని సానుభూతి పొందింది. చివరకు నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకొని భారీ చోరీకి పాల్పడింది.
24 గంటల్లోనే అరెస్ట్
క్రైమ్ డీసీపీ కె.లతామాధురి పర్యవేక్షణలో పోలీసులు సీసీ కెమెరాలు, వాహనాల కదలికలు, పాత పరిచయాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరకు ఈ నెల 13న మధ్యాహ్నం వీఐపీ రోడ్ డౌన్ సమీపంలోని మాస్క్ జంక్షన్ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 423 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ప్లెజర్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సినీ తరహాలో జరిగిన ఈ చోరీ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించిన విశాఖ నగర పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


