మహారాణిపేట : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం విశాఖ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ‘ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్’ అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, బీచ్‌లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, జూట్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి రహదారులు, కాలువలు, చెరువులు, బీచ్ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీలు, గోడ చిత్రాలు, వీధి నాటకాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.


