వేలిముద్రలు పడకపోతే వచ్చే నెల నుంచి బియ్యం కట్
జిల్లాలో ఇంకా 56 వేల మంది పెండింగ్
కేవైసీ పూర్తి కాకపోతే గ్యాస్ సబ్సిడీకి కూడా చెక్
ఉచిత సేవలకు ప్రైవేట్ దోపిడీ.. పేదల నుంచి అదనపు వసూళ్లు
మహారాణిపేట: పేద ప్రజలకు అందే రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం నిబంధనల కత్తి వేలాడదీస్తోంది. తెలుపు/రైస్ కార్డుదారులు ఈనెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వేలిముద్రలు నమోదు చేయించుకోని పక్షంలో, వచ్చే నెల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మందకొడిగా నమోదు
జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈనెల 7వ తేదీ నాటికి సుమారు 80 శాతం మించి కాలేదని తెలుస్తోంది. సర్వర్ లింక్ ఫెయిల్ అవ్వడం, కనెక్టివిటీ సమస్యల వల్ల నమోదు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం అడ్డంకిగా మారింది. కొందరివి పూర్తిగా చెరిగిపోవడంతో నమోదు ప్రక్రియ నిలిచిపోతోంది. పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ–కేవైసీ నత్తనడకన సాగడానికి కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ సబ్సిడీపైనా ప్రభావం
కేవలం రేషన్ మాత్రమే కాకుండా, గ్యాస్ సబ్సిడీ పొందేందుకు కూడా ఈ–కేవైసీ అడ్డంకిగా మారింది. సాంకేతిక కారణాల వల్ల ఈ–కేవైసీ పూర్తికాని వారు, రేషన్ కార్డు లేని వారు తమకు రావాల్సిన గ్యాస్ రాయితీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు వసూళ్లు
నిజానికి ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. కానీ, కొందరు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు దీన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. రేషన్ డీలర్లు లేదా కంపెనీ ప్రతినిధులమని చెబుతూ కార్డుదారులకు ఫోన్లు చేసి, ఆధార్ వివరాలతో పాటు డబ్బులు తీసుకుని ఈ–కేవైసీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు, చిరుద్యోగులు ఈ గడువును అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి
6 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రతి రేషన్ డిపో వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంది. సభ్యులు తమ ఆధార్ కార్డుతో వెళ్లి తక్షణమే నమోదు చేసుకోవాలి.
–వి.భాస్కరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి


