లక్ష్య సాధనలో వెనుకడుగు వేయొద్దు | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనలో వెనుకడుగు వేయొద్దు

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

మహారాణిపేట: ‘మంచి ఆలోచనే విజయానికి తొలి అడుగు.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’ అని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించారు. చిన్న వయసులోనే చక్కని ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని హితవు పలికారు. 10వ తరగతి పరీక్షల్లో 590, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను శుక్రవారం వీసీ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ప్రతి ఒక్కరూ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన కోసం పట్టుదలతో కృషి చేయా లని సూచించారు. ‘మీరు సాధించిన ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. లక్ష్య సాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకండి. మీకు అవసరమైన సహాయం అందించేందుకు నా వంతుగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’అని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం 9 మంది విద్యార్థులతో పాటు కేజీబీవీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినులను ఆయన సత్కరించారు. డీఈవో ఎన్‌.ప్రేమ కుమార్‌, సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖర్‌, ఉప విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు రాజశేఖర్‌, డీసీఈ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

‘పది’ విద్యార్థులకు కలెక్టర్‌ పిలుపు

Advertisement
 
Advertisement
Advertisement