కస్టమ్స్ ఆదాయంలో 7.81 శాతం వృద్ధి
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం కస్టమ్స్ విభాగం ఆదాయ సేకరణ, చట్టబద్ధమైన వాణిజ్యాన్ని సులభతరం చేయడం, దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడడం ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎన్.శ్రీధర్ అన్నారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని సాలగ్రామపురంలోని పోర్టు సాగరమాల కన్వెన్షన్స్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ కస్టమ్స్ జాతీయ ఖజానాకు రూ.13,207.85కోట్ల ఆదాయం సమకూర్చింది. 2025–26 జనవరి వరకు రూ.11,958 కోట్ల లక్ష్యం కాగా 7.81 శాతం వృద్ధితో రూ.12,891.42 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ స్మగ్లింగ్, ఇతర పన్ను ఎగవేత కార్యకలాపాలను కస్టమ్స్ సమర్ధవంతంగా నిరోధిస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలిచ్చారు. అత్యుత్తమ దిగుమతిదారులు, ఎగుమతిదారులు, కస్టమ్స్ బ్రోకర్స్, ఇతర వ్యాపార భాగస్వాములకు వారి సహాయ సహకారాల ఆధారంగా అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ, ఆయా భాగస్వామ్య కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ముగిశాయి.
అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవంలో కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీధర్


