రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఐఎన్‌ఎస్ డేగాలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇంటెలిజెన్స్ డీఐజీ అరిఫ్ హఫీజ్‌లతో కలసి అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వాయు మార్గం ద్వారా ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకునే రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్‌ఎస్ చోళాకు చేరుకుని, విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. 18న ఉదయం ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం వాయు మార్గం ద్వారా ఢిల్లీకి బయల్దేరతారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు 18న ఐఎఫ్‌ఆర్‌కు హాజరవుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఐఎన్‌ఎస్ చోళా, జట్టీ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కాన్వాయ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, నేవల్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


