‘రెడ్ రోప్’ విద్యార్థులకు కేథరిన్ ఆశ్రయం
తగరపువలస: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెచ్‌ఐవీ, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్న రెడ్ రోప్ ఆర్గనైజేషన్ విద్యార్థులు 15 మందికి భీమిలి కేథరిన్ విద్యాసంస్థల యాజమాన్యం ఆదివారం ఆశ్రయం కల్పించింది. ఈ నెల 9న విజయవాడ నుంచి బయలు దేరిన బృందం 5 జిల్లాల్లో 600 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఇందులో భాగంగా వీరికి కేథరిన్ విద్యార్థులు స్వాగతం పలికారు. బృంద సభ్యులు మాట్లాడుతూ ప్రేమాభిమానాలు పెంచుకుని, కోపం తగ్గించుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే అమూల్యమైన జీవితం కోల్పోతామన్నారు. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత ఆలీవర్ ఆర్ రాయి, డైరెక్టర్ ఇవాంజలిన్ రాయి, డీన్ హెప్సీబాలు సైకిల్ యాత్ర బృందాన్ని అభినందించారు.


