‘ఇనాం భూములపై హక్కులు మాకే చెందుతాయి’
తగరపువలస: భీమిలి మండలం మజ్జివలస రెవెన్యూ లక్ష్మీపురం పంచాయతీలోని 31 సర్వే నంబర్లలో ఉన్న 3.41 ఎకరాల ఇనాం భూములపై హక్కులు తమకే చెందుతాయని 20 మంది రైతులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 150 ఏళ్లకుపైగా వారసత్వంగా ఆ భూములు తమకు వస్తున్నాయన్నారు. తోటపంటలు సాగు చేసుకుంటూ ఉన్న తమకు ఇటీవల రీ సర్వేలో కూడా పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తమలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారిమేనని అలాంటి తమను టీడీపీ నాయకునిగా చెప్పుకునే గురుస్వామి డబ్బులకు లాలూచీ పడి నిలువునా ముంచేశాడన్నారు. తమకు సంపూర్ణ సాగుహక్కులు కలిగిన ఉన్న భూములను భీమిలి తహసీల్దార్ పైల రామారావు వెబ్ ల్యాండ్‌లో మాజీ ఎమ్మెల్యే దాట్ల జగన్నాథరాజు కుమారుడు దాట్ల వెంకట కుమార జగన్నాథ గజపతిరాజు పేరిట అక్రమంగా నమోదు చేశారని ఆరోపించారు. ఇనాం సెటిల్‌మెంట్ చట్టం ప్రకారం 2:1లో 1 వాటా కింద సెంటుకు రూ.45 వేలు వంతున ఇనాందారుకు చెల్లించామన్నారు. తహసీల్దార్ స్పందించకపోవడంతో 2025 డిసెంబర్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. తాము నమ్ముకున్న టీడీపీ నాయకులే తమను నడిరోడ్డుపైకి లాగేశారని వాపోయారు. నిరసన కార్యక్రమంలో కనకల సూరిబాబు, కనకల నారాయణ, కురుభుక్త అప్పలరాజు, సన్యాసి, సూర్యనారాయణ, పోలినాయుడు, కాళ్ల రమణ పాల్గొన్నారు.
నేనే ఇనాందారు వారసుడిని:
దాట్ల వెంకట కుమార జగన్నాఽథ గజపతిరాజు
భీమిలి, పద్మనాభం మండలాల్లని సుమారు 25 రెవెన్యూ గ్రామాల్లో మా తండ్రి, మాజీ ఎమ్మెల్యే దాట్ల జగన్నాథరాజు జమీందారు, ఇనాందారుగా ఉన్నారు. మా వద్ద మిగిలిన భూములకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఏ, అడంగల్, 1బీ వంటి రికార్డులు మా తండ్రి పేరిటే ఉన్నాయి. 1996 సర్వే సమయంలో రైతులకు 2 వాటాలు, ఇనాందారుకు ఒక్క వాటాగా సెటిల్‌మెంట్ చేశారు. వాటా సొమ్ము చెల్లించిన రైతులకు 2005లో ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. 2013లో రెవెన్యూ రికార్డులు కంప్యూటరీకరణ జరిగిన సమయంలో కొందరు రైతులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క 11.44 ఎకరాల భూములపై మా తండ్రి పేరు తొలగించి, వారి పేరున ఆన్‌లైన్ చేయించుకున్నారు. వీటిపై అప్పట్లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. 2024 నాటికి మిగిలిన 25 ఎకరాలు కూడా 1బీలో మా తండ్రి పేరిటే ఉన్నాయి. ఈ భూమిలోనే 3.41 ఎకరాలను కనకల ఆదినారాయణ అనే వ్యక్తి ద్వారా దొడ్డిదారిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రోద్బలంతోనే కొందరు టీడీపీ నాయకులు మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఆయనలా రూ.5 వేల కోట్ల విలువైన 58 ఎకరాల ప్రభుత్వ భూములు దోచుకోవడం మాకు చేతకాదు.
‘ఇనాం భూములపై హక్కులు మాకే చెందుతాయి’


