శివనామస్మరణతో ఉప్పొంగిన సాగరం
ఏయూ క్యాంపస్: సాగర తీరం భక్తి భావంతో పులకించింది. ఓం నమఃశివాయ నామస్మరణ ముందు కెరటాల ఘోష చిన్నబోయింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సాగర తీరంలో మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బరామిరెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన మహా కుంభాభిషేకంలో ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడింది. నగరవాసులు ప్రత్యక్షంగా పాదరస లింగానికి అభిషేకం చేసి, పునీతులయ్యారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఏటా సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహా కుంభాభిషేకం సందర్భంగా కోటి 8 లక్షల శివలింగాలకు అభిషేకం చేశారు. కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పంచకాటక పఠనం, వేదపఠనం నిర్వహించారు. పాదరస లింగేశ్వరునికి విభూతి, పంచామృత, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకం జరిపారు. సాయంత్రం స్వామివారి కల్యాణం, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ బి.వి.రామ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు టి.గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, బొడ్డేటి, పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు.


