రక్తపు మడుగుల్లో వృద్ధురాలి ఆర్తనాదం
డాబాగార్డెన్స్: జనంతో కిక్కిరిసిన పూర్ణామార్కెట్ ప్రాంతంం కొనుగోళ్ల సందడి మధ్య ఒక్కసారిగా విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన 70 ఏళ్ల వృద్ధురాలు క్షణాల్లోనే రక్తపు మడుగులో పడిపోయింది. ఆరిలోవకు చెందిన ఆ వృద్ధురాలు శనివారం సాయంత్రం మార్కెట్‌కు వచ్చింది. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్తున్న 52డి నంబరు గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆమె కాలు నుజ్జునుజ్జైంది. రక్తస్రావంతో ఆమె రోడ్డుపై పడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది.
చుట్టూ వందలాది మంది ఉన్నాం ఆ క్షణంలో ఆమెకు తక్షణ సహాయం అందలేదు. 108 అంబులెన్స్‌కు పలుమార్లు కాల్ చేసినా స్పందన రాలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు గంటపాటు ఆమె రోడ్డుపైనే పడివుండటం అక్కడి వారిని కలచివేసింది. ఒక ట్రాఫిక్ పోలీసు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, వెంటనే ఆస్పత్రికి తరలించే వాహనం దొరకకపోవడం బాధాకరం. చివరకు తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స కొనసాగుతోందని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వైద్యులు ఆమె పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.
‘అమ్మలా కనిపించింది’
ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ‘మన ఇంట్లో అమ్మలా కనిపించింది. గంటపాటు రోడ్డుపై పడివుండటం హృదయ విదారకం’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వేగమే ప్రమాదానికి కారణమా?
ఘటన అనంతరం అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం తర్వాత బస్సులు అధిక రద్దీతో నడుస్తున్నాయని, డ్రైవర్లు వేగంగా నడిపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతంలో మరింత జాగ్రత్త అవసరమని స్థానికులు పేర్కొన్నారు.


