బంధువుల ఇంటికి వెళ్తూ..
కాకినాడ రూరల్: విధి వక్రించింది.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు తోడికోడళ్లను కబళించింది. ఇరుకుటుంబాల్లో విషాదం నింపింది. కాకినాడ రూరల్ పరిధి సర్పవరం గ్రామ బైపాస్‌లో ఉన్న 216 జాతీయ రహదారిపై సత్తెమ్మతల్లి గుడి సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లాకు చెందిన తోడికోడళ్లు సుంకర వెంకట పద్మావతి (59), కొల్లు దీప్తి (45) అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నుంచి కాకినాడ రూరల్ మండలం చీడిగ వస్తున్న వీరి కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పైభాగం ఊడిపోయింది. టిప్పర్ ఎదురుగా ఢీకొట్టడంతో ఆ వేగానికి కారు గాలిలో ఎగిరి ముందుపడగా, టిప్పర్ కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. కారులో ఉన్నవారు ప్రాణభయంతో హాహాకారులు చేసినా ప్రాణాలు నిలవలేదు. మృతుల్లో సుంకర వెంకట పద్మావతి ఎస్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగిని. ఆమె అక్కయ్యపాలెంలో నివాసం ఉంటుండగా, దీప్తి టీచర్‌గా పనిచేస్తూ పీఎం పాలెంలో ఉంటున్నారు. పద్మావతి కుమారుడు అనుదీప్ కారును నడుపుతూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
అసంపూర్తి రోడ్డు..
ఆపై అవగాహన లేక
కత్తిపూడి నుంచి పామర్రు వరకూ 216 జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. తిమ్మాపురం వై.జంక్షన్ నుంచి చీడిగ, తూరంగి వరకూ అసంపూర్తిగా పనులు వదిలేశారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా తిమ్మాపురం వై.జంక్షన్ నుంచి సర్పవరం బైపాస్ మీదుగా కారును అనుదీప్ పోనిచ్చారు. బైపాస్ నుంచి సర్పవరం గ్రామంలో భావనారాయణస్వామి గుడి ఎదురుగా రోడ్డులో వచ్చి అక్కడి నుంచి మాధవపురం జంక్షన్ మీదుగా చీడిగ బంధువులు ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద స్థలాన్ని సీఐ పెద్దిరాజు, ఏఎస్సై నాగేశ్వరరావు, ఎస్సై లలితాదేవి తదితరులు పరిశీలించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


