రిటైర్డ్ లైన్‌మన్ ఇంట్లో చోరీ
17 తులాల బంగారం మాయం
మధురవాడ: తీర్థయాత్రలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండడం, బీరువాలోని 17 తులాల బంగారం మాయం కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పీఎంపాలెం క్రైం ఇన్‌స్పెక్టర్ బి.ఎస్.ఎస్. ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ శాఖలో లైన్‌మన్‌గా పనిచేసి రిటైర్ అయిన బొడ్డేటి అప్పలరాజు మధురవాడ శివశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్‌లో తన కుటుంబంతో నివాసముంటున్నారు. ఈ నెల 2న ఇంటికి తాళం వేసి రామేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు కుటుంబ సమేతంగా వెళ్లారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చే సరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం కప్ప పగులగొట్టి ఉంది. అవాక్కయిన బాధితులు లోపలికి వెళ్లి చూడగా బీరువా కూడా తెరిచి ఉంది. దీంతో బంగారం, నగదు చోరీకి గురయ్యాయని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ ప్రకాష్, ఎస్‌ఐ సూర్యప్రకాష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితులు రూ. 6 లక్షల నగదు, 17 తులాల బంగారం పోయిందని మొదట ఆందోళన చెందగా.. పోలీసులు బీరువాను క్షుణ్ణంగా పరిశీలించడంతో అందులో దాచిన రూ. 6 లక్షల నగదు లభ్యమైంది. ఆ నగదును పోలీసులు బాధితులకు అప్పగించారు. అయితే 17 తులాల బంగారం మాత్రం చోరీకి గురైనట్లు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ప్రకాష్ తెలిపారు.
రిటైర్డ్ లైన్‌మన్ ఇంట్లో చోరీ


