వసూళ్లే వేడుక
● నిర్వహణ లోపం.. ఉత్సవ్‌కు శాపం!
తొలిరోజునే విశాఖ ఉత్సవ్ అభాసుపాలు
సాక్షి, విశాఖపట్నం: అంతన్నారు.. ఇంతన్నారు.. ఆదిలోనే హంసపాదు వేసేశారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక సంప్రదాయాల్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహించాల్సిన విశాఖ ఉత్సవ్‌ని.. చంద్రబాబు ప్రభుత్వం వసూళ్ల ఉత్సవంలా మార్చేసింది. తొలిరోజునే ఉత్సవ్ నిర్వహణ గందరగోళంగా మారిపోయింది. ప్రైవేట్ ఈవెంట్ సంస్థకు నిర్వహణ బాధ్యత కట్టబెట్టడంతో.. అధికారులు తమకేమీ పట్టనట్లుగా గాలికొదిలేశారు. కార్యక్రమాల నిర్వహణ, స్టాళ్ల ఏర్పాటు ఇలా ప్రతి అంశంలోనూ ప్రారంభోత్సవమే ప్రారబ్ధోత్సవంగా తయారైంది. స్టాళ్లకు డబ్బులు వసూలుచేసిన నిర్వహణ సంస్థ చివరి నిమిషం వరకూ వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలో చెప్పకపోవడంతో.. దరఖాస్తుదారులు ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
స్టాళ్ల ఏర్పాటులో అయోమయం
విశాఖ ఉత్సవాలు గందరగోళ పరిస్థితుల నడుమ శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను చంద్రబాబు ప్రభుత్వం తమ నేతల జేబులు నింపే ఉత్సవాలుగా మార్చేయడంతో తికమక పరిస్థితులు నెలకొన్నాయి. స్టాళ్ల ఏర్పాటులో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీచ్ రోడ్డులో స్టాళ్లకు వేలల్లో రుసుం వసూలు చేసిన నిర్వాహకులు.. వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలో చివరి నిమిషం వరకూ చెప్పకపోవడంతో.. దరఖాస్తు చేసుకున్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఉత్సవాలను మంత్రులు ప్రారంభించేశారు. మరోవైపు ప్రజలు కార్యక్రమాలు చూసేందుకు బీచ్‌కు చేరుకున్నా.. స్టాళ్లు మాత్రం ఏర్పాటు కాలేదు.
దీంతో స్టాళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకులను నిలదీసేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు వచ్చి.. నిర్వాహకులతో మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దారు. అయినా చివరి నిమిషంలో మరో రూ.7 వేలు విద్యుత్ బిల్లు కోసం చెల్లించాలంటూ ఈవెంట్ నిర్వహణ సంస్థ శ్రేయాస్ మీడియా ప్రతినిధులు దరఖాస్తుదారులకు చెప్పడంతో.. వారంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వేలల్లో డబ్బులు తీసుకున్నారనీ ఏర్పాట్లు చేయడంతో విఫలమయ్యారంటూ వారంతా ఆరోపించారు.
స్టాళ్ల ఏర్పాటులో గందరగోళం చివరి నిమిషం వరకూ ఎక్కడ పెట్టాలనేదానిపై స్పష్టత లేక ఇక్కట్లు పవర్ బిల్లు కోసం డబ్బులివ్వాలంటూ మరోసారి డిమాండ్ ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం
తమకేం సంబంధం లేదుగా..!
ఈ విషయంపై కొందరు దరఖాస్తుదారులు అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే స్టాళ్ల ఏర్పాటు నిర్వహణ బాధ్యత తమకు సంబంధించింది కాదని.. అధికారులు సమాధానమిచ్చారని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థకే పెత్తనం ఇవ్వడంతో జిల్లా అధికారులు ఎందులోనూ తలదూర్చడం లేదు. దీంతో స్టాళ్ల నిర్వాహకుల బాధలు వినే నాథుడే కరువయ్యాడు.


