రూ. 1.07 కోట్ల సొత్తు రికవరీ
అల్లిపురం: నగర కమిషనరేట్ పరిధిలో గత డిసెంబర్‌లో జరిగిన వివిధ ఆస్తి నేరాలకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక బృందాల కృషితో 44 కేసులను ఛేదించి, రూ. 1,07,17,800 విలువైన సొత్తును రికవరీ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన రికవరీ మేళాలో ఆయన వివరాలను వెల్లడించారు.
77 కేసుల నమోదు
గత డిసెంబర్‌లో మొత్తం 77 ఆస్తి నేరాలు నమోదు కాగా, డీసీపీ (క్రైం) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు 44 కేసులను విజయవంతంగా ఛేదించాయి. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 42 మంది నిందితులను అరెస్టు చేశారు. ఛేదించిన కేసుల్లో ఒక దోపిడీ, 3 పగటిపూట ఇళ్ల దొంగతనాలు, 2 రాత్రిపూట ఇళ్ల దొంగతనాలు, ఒక చైన్ స్నాచింగ్, ఒక బస్సు దొంగతనం, 15 మోటార్ సైకిల్ దొంగతనాలు, ఒక ఆటో దొంగతనం, 3 వైర్ల దొంగతనాలు సహా 17 సాధారణ దొంగతనాలు ఉన్నాయి.
భారీగా సొత్తు స్వాధీనం
నిందితుల నుంచి రూ. 56.77 లక్షల విలువైన చోరీ సొత్తును, అలాగే రూ. 50.40 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాటిలో 294 గ్రాముల బంగారం, 301 గ్రాముల వెండి, రూ. 1,72,500 నగదు ఉన్నాయి. వాహనాల విషయానికొస్తే.. 15 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, ఒక బస్సు, 12 ఆటో బ్యాటరీలను సీజ్ చేశారు. వీటితో పాటు 2 మెట్రిక్ టన్నుల బొగ్గును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 4 దొంగిలించబడిన మొబైల్స్, 322 పోగొట్టుకున్న మొబైల్స్ కలిపి మొత్తం 340 ఫోన్లను రికవరీ చేశారు.
నేరాల కట్టడికి డ్రోన్లతో నిఘా
నగరంలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. డిసెంబర్‌లోనే నగరవ్యాప్తంగా కొత్తగా 168 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 178 సమావేశాలు నిర్వహించామని చెప్పారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పగలు, రాత్రి ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ బీట్‌ల ద్వారా నిఘా ఉంచామని కమిషనర్ వివరించారు.
రూ. 1.07 కోట్ల సొత్తు రికవరీ


