నిరుత్సాహపరిచిన ఉత్సవ్
ఏయూక్యాంపస్: విశాఖ ఉత్సవ్ నిర్వహణకు అధికారులు చేసిన ప్రచారానికి.. ఏర్పాట్లకు పొంతన లేదు. తొలిరోజు ప్రజల నుంచి స్పందన కరువైంది. వేదిక ఎదురుగా వేసిన కుర్చీలు ఖాళీగా కనిపించాయి. వేదికకు ఎదురుగా ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన ఈత చెట్లు, ఫొటో బూత్‌లు కొంత వరకు ప్రజలకు యువతను ఆకట్టుకున్నాయి. పక్కనే ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టాల్స్ కొత్తదనాన్ని చూపలేదు. నగరంలో నిత్యం లభించే ఆహార పదార్థాలే అక్కడ కూడా కనిపించడంతో ప్రజలు కొంత నిరాశ చెందారు. అదే విధంగా మాడుగుల హల్వా దుకాణాలతో ఒకవైపు స్టాల్స్ అన్నీ నింపేశారు. వేదికపై గాయని సునీత పాటలు పాడుతున్నప్పుడు వెనుక ఉన్న ఎల్‌ఈడీ తెరపై గాయకులు కనిపించే విధంగా నిర్వాహకులు చేయలేదు. దీంతో దూరం నుంచి చూస్తూ పాటు వింటున్న వారికి గాయకులు కనిపించ లేదు. వెనుక ఉన్న తెరపై గాయకులు పాడుతున్న దృశ్యాలను ప్రసారం చేస్తే మరింత ఆసక్తిగా ఉండేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడంలో కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ బృందం విఫలమైంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులు శ్రమించారు. సంపత్ వినాయగర్ నమూనా ఆలయం మూసి ఉండటంతో కొంత నిరుత్సాహ పడ్డారు. అదే విధంగా పక్కనే ఏర్పాటు చేస్తున్న ఆట వస్తువులు, జెయింట్‌వీల్ వంటివి ఇంకా సిద్ధం కాలేదు. దీంతో ఉత్సవ్‌కు వచ్చిన చిన్నారులు గుర్రాలు, ఒంటెలు ఎక్కి సంతృప్తి చెందారు. కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ వ్యాఖ్యానం, గాయని సునీత గానం కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నిర్మాణదశలోనే ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ జోన్
ప్రధాన వేదిక వద్ద జనాలు లేక ఖాళీగా కుర్చీలు
నిరుత్సాహపరిచిన ఉత్సవ్


