పోలీసుల అత్యుత్సాహం
మంత్రుల ర్యాలీ వస్తుందని గర్భిణిని పక్కకు లాగేసిన పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన గర్భిణి తరపు బంధువులు, స్థానికులు అడుగడుగునా ఆంక్షలతో అవస్థలు పడ్డ ప్రజలు విశాఖ ఉత్సవ్ ఏవీలో కనిపించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్ వేదిక వద్ద కనిపించని సింహాచలం దేవస్థానం నమూనా
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు నిర్వహణ లోపు.. మరోవైపు పోలీసుల ఓవరాక్షన్‌తో విశాఖ ఉత్సవ్ తొలిరోజున ఆశించిన స్పందన కనిపించలేదు. పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రారంభోత్సవ సమయంలో మంత్రులు బీచ్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ర్యాలీ ప్రారంభం కాకముందు నుంచి మంత్రులు వేదిక వద్దకు చేరుకున్న వరకూ గంటల తరబడి వాహనాలు నిలిపేశారు. ఇదే సమయంలో బీచ్‌కు వచ్చిన ఓ గర్భిణి విషయంలో పోలీసుల ప్రవర్తించిన తీరు స్థానికుల్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ర్యాలీ వస్తోందంటూ గర్భిణిని పక్కకు విసురుగా లాగేశారు. కిందపడిపోతున్న ఆమెని బంధువులు పట్టుకున్నారు. ఈ ప్రవర్తనతో ఒక్కసారిగా బంధువులు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనని చూసిన స్థానికులు కూడా పోలీసుల తీరుని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సందర్శకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాదాపు 20 నిమిషాల పాటు పోలీసుల తీరుని తప్పుపడుతూ వారితో వాదులాడారు. ఉన్నతాధికారులు వచ్చి.. నచ్చజెప్పడంతో శాంతించారు. రాకపోకలను నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బీచ్‌కు వచ్చిన వారంతా రోడ్లపై వాహనాల్లోనే గంటల పాటు ఉండిపోయి అసహనం వ్యక్తం చేశారు.
స్టీల్‌ప్లాంట్ ఎక్కడ..?
విశాఖ ఉత్సవ్ ప్రారంభించిన సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఉత్సవ్ ఏవీని మంత్రులు విడివిడిగా ఆవిష్కరించారు. విశాఖ ఏవీలో మాత్రం స్టీల్‌ప్లాంట్ గురించి ఎక్కడా కనిపించలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు గుండెకాయలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమ లేకుండా.. వైజాగ్ ఏవీ ఎలా తయారు చేశారంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం సహకరిస్తున్న నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయకుండా ఉండేందుకే ఈ విధంగా ఏవీలో లేకుండా చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలో విశాఖకు చెందిన ప్రసిద్ధ ఆలయాల నమూనాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం కనిపించకపోవడం గమనార్హం. దీనిపై కొందరు స్థానికులు నిలదీయగా.. రేపటిలోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్వాహకులు బదులిచ్చినట్లు తెలుస్తోంది.


