పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు

Dec 6 2025 7:22 AM | Updated on Dec 6 2025 7:22 AM

పాఠశా

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు

● పేరెంట్స్‌ మీటింగ్‌ను హైజాక్‌ చేసిన టీడీపీ ● పిలిచింది తల్లిదండ్రులను... ప్రాధాన్యం తమ్ముళ్లకు!

8లో

ఆరిలోవ : చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాఠశాలలను తమ పార్టీ ప్రచారానికి వేదికలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో జరిగిన పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటిని సరిదిద్దకపోవడంతో శుక్రవారం జరిగిన పీటీఎంలో అదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈ సమావేశాలు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య జరగాలి. ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా టెంట్లు వేసి, వేదికలు సిద్ధం చేశారు. తమ పిల్లల చదువుల గురించి మాట్లాడేందుకు పిలిచారని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తే.. అక్కడ వారికి వింత పరిస్థితి ఎదురైంది. వేదికల మీద ఆశీనులవ్వాల్సిన తల్లిదండ్రుల కమిటీ సభ్యులను పక్కనపెట్టి.. స్థానిక టీడీపీ నాయకులకు, కూటమి నేతలకే అగ్రతాంబూలం దక్కింది.

నేలపైనే విద్యార్థులు : పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గినట్లు స్పష్టంగా కనిపించింది. నాయకులను పిలవకపోతే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో.. రెండు రోజుల ముందుగానే వారికి ఆహ్వానాలు పంపారు. దీంతో పాఠశాల వేదికలపై హెచ్‌ఎంలు, ఒకటి రెండు టీచర్లు మినహా.. మిగిలిన కుర్చీలన్నీ పచ్చ చొక్కాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇక వచ్చిన తల్లిదండ్రులకు అరకొర సౌకర్యాలే కల్పించారు. కొన్ని చోట్ల విద్యార్థులను నేలపైనే కూర్చోబెట్టారు. తాగడానికి మంచినీరు కూడా కరువైంది.

టీడీపీ ప్రచార సభలా... : వేదికెక్కిన నాయకులు విద్యార్థుల క్రమశిక్షణ, విద్యాభివృద్ధికి సంబంధించిన సూచనలు ఇవ్వడం మానేసి, తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికే సమయాన్ని వెచ్చించారు. మంత్రి లోకేష్‌ దయ వల్లే చదువులు సాగుతున్నాయంటూ భజన కార్యక్రమం నిర్వహించారు. ‘మా పిల్లల చదువుల సంగతి వదిలేసి, మీ రాజకీయ ఉపన్యాసాలు వినడానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు?’అని పలుచోట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఆకలేస్తోంది.. వదిలేయండి బాబోయ్‌ అని విద్యార్థులు దీనంగా చూసినా.. నాయకులు తమ ఊకదంపుడు ఉపన్యాసాలను కొనసాగించారు. విడ్డూరం ఏంటంటే.. విద్యార్థులను తీర్చిదిద్దే గురువులను సత్కరించాల్సింది పోయి.. ఉపాధ్యాయులే టీడీపీ నాయకులకు సన్మానాలు చేయడం విద్యావేత్తలను విస్మయానికి గురిచేసింది.

బడిలో టీడీపీ నాయకుడి

వీరంగం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న తీరు మరోసారి బహిర్గతమైంది. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్తు గురించి చర్చించాల్సిన పవిత్రమైన పాఠశాల వేదికలు.. అధికార పార్టీ ప్రచార అడ్డాలుగా మారిపోయాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ‘పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌(పీటీఎం)’కాస్త.. ‘టీడీపీ పేరెంట్స్‌ మీటింగ్‌(టీటీఎం)’లా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

వెలవెలబోయిన సమావేశాలు

పలు చోట్ల తల్లిదండ్రులు ఈ సమావేశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులకు అసలు సమాచారమే ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రంపాలెం హైస్కూల్లో సుమారు 3,200 మంది విద్యార్థులు ఉండగా.. హాజరైన తల్లిదండ్రులు కేవలం 200 మంది మాత్రమే. అలాగే తోటగరువు హైస్కూల్‌లో 1,400 మంది విద్యార్థులకు గాను, 200 లోపే తల్లిదండ్రులు వచ్చారు. శ్రీకృష్ణాపురం గురుకులంలో 400 మంది విద్యార్థులకు గాను హాజరు 150 దాటలేదు. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. జరిగింది తల్లిదండ్రుల సమావేశం కాదని, కేవలం అధికార పార్టీ బలప్రదర్శన సభ అని తేటతెల్లమవుతోంది. విద్యాలయాలను రాజకీయ కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు1
1/2

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు2
2/2

పాఠశాల వేదికలపై రాజకీయ పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement