సముద్రంలో పడి మత్స్యకారుడు గల్లంతు
మహారాణిపేట: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు(55) నగరంలోని జాలరిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్‌డీ ఏపీవీ5, ఎంఎం 872 నంబర్ గల బోటులో రాములుతో సహా మొత్తం ఎనిమిది మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. హార్బర్ నుంచి తూర్పు వైపు విశాఖకు 70 మైళ్ల దూరంలో వారు చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 8.30 గంటల సమయంలో వేటలో ఉండగా.. రాములు ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులకు సమాచారం అందించి వారి సాయంతో వెతికినా.. రాములు ఆచూకీ లభించలేదు. దీంతో బోటు డ్రైవర్ వాసుపల్లి లక్ష్మణరావు విషయాన్ని హార్బర్ అసోసియేషన్ నాయకులకు చేరవేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోటు హార్బర్‌కు చేరుకోగానే మత్స్యకారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


