నేలపాలు చేసేసి..?
ద్రవ ఉక్కు
విశాఖ సిటీ : విశాఖ స్టీల్‌ప్లాంట్ వరుస నిర్ణయాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఉక్కు పరిశ్రమలో స్టీల్ ఉత్పిత్తి ఆధారంగా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న యాజమాన్యం.. కావాలనే ఉత్పత్తిని తగ్గించే కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగుల జీతాల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు మరోవైపు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్లాంట్‌లో విలువైన ద్రవ ఉక్కు నేలపాలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. స్టీల్‌ను స్క్రాప్ పేరుతో తక్కువ ధరకు అమ్మేందుకే ద్రవ ఉక్కును నేలపాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణకు వామపక్షాలు, కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.
టన్నులకు టన్నులు పూల్డ్ ఐరన్
స్టీల్‌ప్లాంట్‌లో ద్రవ ఉక్కును ఉద్దేశపూర్వకంగానే నేల పాలు చేసి స్క్రాప్ పేరుతో తక్కువకు ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్‌లో హాట్ మెటల్ స్టీల్‌మెల్ట్ షాప్(ఎస్‌ఎంఎస్)నకు వెళ్లకుండా స్క్రాప్ పిట్‌లో పోస్తున్నారని పేర్కొంటున్నారు. స్క్రాప్ కాంట్రాక్టర్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఈ విధంగా (పూల్డ్ ఐరన్) చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పూల్డ్ ఐరన్ ద్వారా ప్లాంట్ నష్టమని భావించి, దీన్ని నిలుపుదల చేయాలని ఒక కమిటీని సైతం గతంలో ఏర్పాటు చేశారు. ఏదైనా కారణంతో పూల్డ్ ఐరన్ చెయ్యాలంటే ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కాలంగా పూల్డ్ ఐరన్‌ను నిలుపుదల చేశారు. అయితే ఈ నెల 2వ తేదీన 300 టన్నులు, 3న 1,200 టన్నులు, 4న 600 టన్నులు పూల్డ్ ఐరన్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే..
ఉత్పత్తి పెంచుతున్నట్లు గొప్పలు చెప్పుకునే క్రమంలో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కంపెనీకి తీవ్ర నష్టమని కార్మిక, వామపక్ష నేతలు చెబుతున్నారు. ఇప్పటికే స్టీల్ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిసరుకు ఖర్చు పెరుగుతోంది. ఉత్పత్తికి అవసరమయ్యే రా మెటీరియల్ అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో పూల్డ్ ఐరన్ చేయడం నష్టమని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి జరగడం లేదని కార్మికులు పనిచేయడం లేదని చెబుతున్న యాజమాన్యం.. చేస్తున్న ఉత్పత్తిని నేలపాలు చేయడం పట్ల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఉక్కును తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు ముట్టజెప్పే కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.
విచారణ జరపాలి
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం విలువైన స్టీల్‌ను స్క్రాప్ పేరుతో తక్కువ ధరకు అమ్మేందుకు ద్రవ ఉక్కును నేలపాలు చేస్తోంది. దీనిపై తగిన విచారణ జరపాలి. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి స్టీల్ మంత్రి అనుమతి ఉందా? దీనికి ఎవరు బాధ్యులు. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. – సిహెచ్.నర్సింగరావు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఐటీయూ
స్క్రాప్ పేరుతో తక్కువ ధరకు అమ్మేందుకు కుట్రలు
బీఎఫ్ హాట్ మెటల్ ఎస్‌ఎంఎస్‌కు వెళ్లకుండా
స్క్రాప్ పిట్‌లో పోయడం అనుమానాలు
కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే పూల్డ్ ఐరన్ తయారీ


