స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల విక్రయాలు
మధురవాడ: భారత్– దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ నేపథ్యంలో.. క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం బహిరంగంగానే బ్లాక్ దందా కొనసాగింది. టికెట్ల కోసం క్రీడాభిమానులు ఎగబడుతుండటంతో.. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు టికెట్లను భారీ రేట్లకు అనధికారికంగా విక్రయించారు. రూ.3 వేల టికెట్‌ను రూ.5వేలకు, రూ.5వేల టికెట్‌ను రూ.8 వేలకు విక్రయించడం గమనార్హం. ఈ తతంగమంతా స్టేడియం నిర్వాహకులు, పోలీసుల కళ్లెదుటే జరుగుతున్నా.. వారు చోద్యం చూడటం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


