రూ.16 వేలు కాదు.. రూ.16,200!
డాబాగార్డెన్స్: సాధారణంగా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ‘అబ్బే.. అంత ఖర్చు కాలేదు’ అని బుకాయించడం చూస్తుంటాం. కానీ, జీవీఎంసీ అధికారులు మాత్రం ‘అంత తక్కువ చేసి చూపించారేంటి? మేం ఇంకా ఎక్కువే ఖర్చు చేశాం’ అని సగర్వంగా చెప్పుకుంటున్నారు. యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల విషయంలో అవినీతి ఆరోపణలపై జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్ ఇచ్చిన వివరణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘మొబైల్ టాయిలెట్ మస్కా’పేరుతో ‘సాక్షి’దినపత్రికలో గురువారం ఓ కథనం ప్రచురితమైంది. ఒక్కో వీఐపీ టాయిలెట్‌కు రూ.16వేలు అద్దె చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పేర్కొనగా.. ఈ కథనానికి ప్రధాన వైద్యాధికారి స్పందించారు. ‘మీరు రూ.16 వేలు అని రాశారు.. కానీ పన్నులన్నీ కలుపుకుని ఒక్కో టాయిలెట్‌కు రూ.16,200 అవుతోంది’ అని చెప్పడం గమనార్హం. ఎగ్జిక్యూటివ్ టాయ్‌లెట్ ఒక్కొక్కటికి జీఎస్టీ, ఇతర చార్జీలు కలుపుకుని రూ.11,957, వీఐపీ టాయిలెట్ ఒక్కొక్కటి రూ.16,200, సాధారణ టాయిలెట్స్ ఒక్కొక్కటి రూ.6,600 చొప్పున అద్దె ప్రాతిపదికన కొటేషేన్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అంతేనా.. ఏలూరు మున్సిపాలిటీలో ఒక్కొ క్క ఎగ్జిక్యూటివ్ టాయిలెట్ రూ.2,48,000 చొప్పున, వీఐపీ టాయిలెట్ ఒక్కొక్కటి రూ.2,68,000 చొప్పున కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎటువంటి అవినీతి జరగలేదంటూ.. ఇటీవల కర్నూలులో జరిగిన సీఎం సభకు కూడా ఇవే ధరలతో టాయిలెట్లు ఏర్పాటు చేసినట్టు ప్రధాన వైద్యాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక బయో టాయిలెట్ మార్కెట్‌లో సుమారు రూ.15 వేలకు లభిస్తోంది. అవే వందలు, వేలల్లో కొంటే రూ.10 వేల నుంచి రూ.12 వేలకే లభించే అవకాశం ఉంది. మన జీవీఎంసీ అధికారులు ఒక్క రోజు ముచ్చట కోసం రూ.1.82 కోట్లను చెల్లించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రశ్నిస్తే.. ‘రూ.16 వేలు కాదు..16,200’ అని సరిచేయడం ద్వారా అధికారులు ఏం చెప్పదలుచుకున్నారో వారికే తెలియాలి. పైగా ఇతర ప్రాంతాల్లో లక్షలు పెట్టి కొన్నారు.. మేం అద్దెకే తెచ్చాం అంటూ వింత పోలికలు తెచ్చి ఈ ఖర్చును సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
అవినీతి ఆరోపణలపై జీవీఎంసీ వైద్యాధికారి వింత వివరణ


