లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర ద్రోహం
బీచ్‌రోడ్డు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆశీల్‌మెట్ట మీదుగా గాంధీ విగ్రహం వద్ద వరకు భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. అనంతరం జీవీఎంసీ మెయిన్ రోడ్డులో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సంఘాల నాయకులు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను మార్పు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చిందన్నారు.
కార్మికులను బానిసలుగా మార్చేస్తాయి
ఈ లేబర్ కోడ్‌లు అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని, ఏ విధమైన హక్కులు లేకుండా పోతాయని నాయకులు ఆరోపించారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, జీతభత్యాలు బేరమాడుకునే హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పీఎఫ్, సెలవులు వంటివి ఏమీ ఉండవని, అన్నీ యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి ఉంటుందన్నారు. మోదీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు ఎంతో ప్రయోజనమని గొప్పలు చెబుతున్నప్పటికీ, ఈ లేబర్ కోడ్‌లు కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తాయన్నారు. అందుకనే యావత్తు కార్మిక వర్గం ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోపిడీ చేసుకునేందుకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారని, కార్మికులకు ఉన్న హక్కులను కూడా కాలరాసి, వారి శ్రమను విపరీతంగా దోచుకోవడానికి ఈ లేబర్ కోడ్‌లు ఉపయోగపడతాయని నాయకులు పేర్కొన్నారు. అందుకనే వీటిని రద్దు చేసే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలన్నారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోకపోతే, ప్రభుత్వాన్ని దించే వరకు పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. నిరసనలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, సీఎఫ్‌టీయూఐ జాతీయ అధ్యక్షుడు కనకారావు, ఏపీఎఫ్‌టీయూ నాయకురాలు మహిత, ఏఐసీసీటీయూ నాయకులు వాసుదేవరావు తదితర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.


