జీవీఎంసీలో రోడ్ల అభివృద్ధికి కొత్త విధానం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో 88.35 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం యాన్యుటీ పే–అవుట్ మోడల్‌ను అమలు చేయడానికి జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 307 కోట్లుగా తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా రహదారుల నాణ్యతలో స్థిరత్వం ఉంటుందన్నారు. నిర్మాణంలో యూనిఫామిటీ ఉంటుందని, గడువులోగా పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా జీవీఎంసీకి ఆర్థిక భారం తగ్గుతుందని, ఖర్చులు నియంత్రణలో ఉంటాయన్నారు. ప్రస్తుతం పనులను పలువురు కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి భిన్నంగా.. ఈ హైబ్రిడ్ వార్షిక చెల్లింపు నమూనా కింద మొత్తం ప్రాజెక్టును ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం రహదారుల నిర్వహణకు జీవీఎంసీ ఏటా సుమారు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, బహుళ టెండర్ల వల్ల కలిగే జాప్యాన్ని నివారించి, అధిక నాణ్యతా ప్రమాణాలు అందించగల ప్రతిష్టాత్మక కాంట్రాక్టర్లను ఆకర్షించడం ఈ విధానం లక్ష్యమన్నారు. 40 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న ప్రధాన రహదారులను ఈ ప్రాజెక్టులో పరిధిలోకి తీసుకుంటున్నామని, జోన్–2, 3, 4, 5, 6 లోని ముఖ్యమైన రహదారులను సాంకేతిక పరిశీలన, ట్రాఫిక్ సాంద్రత, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్, తిరువనంతపురం వంటి నగరాల్లో విజయవంతమైన ఈ నమూనాను విశాఖలో అమలు చేయాలనే ప్రతిపాదనకు గతంలోనే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రోడ్డు పునరుద్ధరణ, సెంట్రల్ మీడియన్ అభివృద్ధి, పచ్చదనం పెంపు, వివిధ పట్టణ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రహదారుల వెంట ఇచ్చే ప్రకటనలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే రాబడిని వార్షిక చెల్లింపులకు సర్దుబాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ జీవీఎంసీకి స్వతంత్ర ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలు అందిస్తుందని కమిషనర్ వివరించారు.


