అంతా గుప్తాధిపత్యం
గోమాంసం కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోమాంసం ఎగుమతి కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోంది. 1.89 లక్షల కిలోల గోమాంసం పట్టుబడిన కేసులో అసలు సూత్రధారిగా అనుమానిస్తున్న టీడీపీ కీలక నేతను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇటీవలే సదరు కోల్డ్ స్టోరేజ్ యజమాని మంత్రులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కీలక సూత్రధారులను తప్పించి.. గోడౌన్ మేనేజర్‌పైనే చర్యలు తీసుకొనేలా కేసును మలుపులు తిప్పేందుకు యత్నిస్తున్నారే తప్ప.. అసలు ఈ గోమాంసం ఎలా ఇక్కడికి వచ్చిందనే దానిపై కనీసం విచారణ చేపట్టడం లేదని సమాచారం. మరోవైపు ఆనందపురం పోలీసులతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్‌ఐ) కూడా కేసు నమోదు చేసినా.. దర్యాప్తు మాత్రం అడుగు ముందుకు కదలకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా సింగరాయ కొండలో ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా పట్టుబడిన గోమాంసం కూడా విశాఖ నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలినా.. ప్రభుత్వంలో మాత్రం కేసు విషయంలో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం.
గోమాంసం పట్టుబడిన
టీడీపీ నేత గోదాం
మంత్రులతో శ్రీమిత్ర యజమాని, టీడీపీ కీలక నేత గుప్తా భేటీ? కేసు నుంచి గుప్తాని తప్పించేందుకు ప్రయత్నాలు! ఇప్పటివరకు కోల్డ్ స్టోరేజీ మేనేజర్ గఫూర్ మాత్రమే అరెస్ట్ దర్యాప్తును నీరుగార్చేలా ఆలస్యం చేయాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు! ఇటీవల సింగరాయకొండలో గోమాంసం కూడా విశాఖ నుంచే వెళ్లినట్లు అనుమానాలు
ఫోరెన్సిక్ నివేదికలు
స్పష్టం చేసినా..
ఈ నెల 3న నగర శివారు శొంఠ్యాంలో శ్రీ మిత్ర గోడౌన్ నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఓ వైపు పోలీసులు మరో వైపు డీఆర్‌ఐ ఈ కేసు విచారణలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసును చంద్రబాబు ప్రభుత్వం మరుగున పడేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ నుంచి పశుసంవర్థక శాఖ అధికారులు తీసుకున్న 6 శాంపిల్స్‌లో మూడింటిలో నిషేధిత గోమాంసం ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1.89 లక్షల కిలోల నిషేధిత మాంసాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చారనే దానిపై ప్రభుత్వం దర్యాప్తు చేయకపోవడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.


