డిజిటల్ ఇండియాతో నూతన శకానికి నాంది
వన్ ఇండియా త్రూ డిజిటల్ ఇండియాపుస్తకావిష్కరణలో జస్టిస్ గవాయ్
మద్దిలపాలెం: డిజిటల్ పరివర్తన, సామాజిక సమానత్వంపై జాతీయ చర్చకు ఒక మైలురాయిగా ఏయూ అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ మేక జేమ్స్ స్టీఫెన్ రచించిన ‘‘వన్ ఇండియా త్రూ డిజిటల్ ఇండియా’’పుస్తకం నిలుస్తుందని భారత విశ్రాంత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవాయి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సామాజిక న్యాయాన్ని విస్తరించడానికి దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించడానికి తోడ్పడుతుందన్నారు. దీన్ని ఒక రాజ్యాంగ సాధనంగా వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువల్ని బలోపేతం చేసే పరివర్తన సాధనంగా డిజిటల్ ఇండియాను చూపడం పట్ల రచయితను అభినందించారు. రచయిత ఆచార్య జేమ్స్ స్టీఫెన్ మాట్లాడుతూ మానవ గౌరవాన్ని పెంచినప్పుడే సాంకేతికతకు అర్థం ఉంటుందన్నారు. సామాజిక న్యాయం–సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ యాదవ్, అదనపు కార్యదర్శి కారలిన్ ఖోంగ్వార్ దేశ్‌ముఖ్, మెంబర్ సెక్రటరీ వి.అప్పారావు, డైరెక్టర్ మనోజ్ తివారీలు పాల్గొని మాట్లాడారు.


