రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక
ఆరిలోవ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు బృందాలుగా ఏర్పడి, నాటికలను ప్రదర్శించారు. డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ‘స్మార్ట్ అగ్రికల్చర్’ అనే అంశంపై నాటిక ప్రదర్శించిన పెందుర్తి మండలం, శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం విజేతగా నిలిచింది. ఈ నెల 7న గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటికను ఎంపిక చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. రైతులు ఆధునికీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగిందన్నారు. ఈ బృందానికి మరింతగా శిక్షణ ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచేలా కృషి చేయాలని గైడ్ టీచర్ సీతాలక్ష్మికి సూచించారు. ఈ పోటీల్లో ఉమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా–ఎంపవరింగ్ లైవ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జ్యూరీ సభ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు బి.నాగేశ్వరరావు, నవరస ఆర్ట్స్ ఫౌండర్ పి.వి.రమణమూర్తి, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు
రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక


