విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఇన్‌చార్జి మంత్రి డోలా
మహారాణిపేట: విశాఖపట్నం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని, ఈ మహా కార్యాన్ని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. సుమారు 40పైగా దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు సదస్సుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ, అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, రూ.2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు. విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లు, వేదికలు, ఇతర అంశాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంత్రికి మ్యాప్ సహాయంతో వివరించారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీఐఐ ప్రతినిధి మాళి తదితరులు పాల్గొన్నారు.


