బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
ఆరిలోవ: బీఆర్‌టీఎస్‌లో పైనాపిల్‌కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఆయన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. నగరంలోని సీతంపేటకు చెందిన ఆలేటి సూర్యనారాయణ(65) బుధవారం సాయంత్రం పైనాపిల్‌కాలనీ వద్ద జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో బంధువులను కలవడానికి వచ్చారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడానికి బయలుదేరారు. ఈ క్రమంలో పైనాపిల్‌కాలనీ బస్టాప్ వద్దకు చేతికర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అడవివరం నుంచి హనుమంతవాక వైపు ముగ్గురితో వెళ్తున్న ద్విచక్రవాహనం అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో సూర్యనారాయణ కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచారు. బైక్ నడిపిన వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆరిలోవ ట్రాఫిక్, లా అండ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. గాయాలైన ద్విచక్రవాహనచోదకులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య ఈశ్వరమ్మ, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యనారాయణ జగదాంబ జంక్షన్‌లో చిరు వ్యాపారి. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ రాందాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి


