రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ! | - | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ!

Oct 23 2025 9:22 AM | Updated on Oct 23 2025 9:22 AM

రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ!

రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ!

● తుఫాన్‌ వేగంతో జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ● చదివింది ఎప్పుడు? చర్చించింది ఎప్పుడు అంటూ విమర్శలు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం తుఫాన్‌ వేగంతో ముగిసింది. మేయర్‌, స్థాయీ సంఘం చైర్మన్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 217 అజెండా అంశాలను చర్చించి.. అందులో 213 అంశాలకు ఆమోద ముద్ర వేయడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. ఆలస్యంగా 11.50కి మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా అజెండాలోని అంశాలన్నీ పూర్తి చేసి మమా అనిపించారు. అసలు 217 అంశాలున్న అజెండాను సభ్యులకు ఒక్క రోజు ముందు ఇస్తే.. వారు ఎప్పుడు చదివారు? అంశాలపై ఎంత పట్టు సాధించారు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సమావేశం మొక్కుబడిగా సాగినా.. కొన్ని కీలక అంశాలపై మాత్రం వాడివేడిగా చర్చ జరిగింది. అయితే వాటికీ పూర్తిస్థాయి సమాధానాలు లభించలేదు.

విధి విధానాలేవి? : స్థాయీ సంఘం విధి విధానా లు చెప్పమంటూ సభ్యురాలు సాడి పద్మారెడ్డి మూడో సారి అడిగినా అధికారుల నుంచి స్పందన కరువైంది. మేయర్‌ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత కార్యదర్శి బి.వెంకటరమణ ‘ఈరోజే పంపిస్తా’నని బదులివ్వడం గమనార్హం. 8 జోన్లలో జీవీఎంసీ దుకా ణాలు, సముదాయాలు, సబ్‌–లీజుల వివరాలు, బకాయిలపై సభ్యులు ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో వివరాలివ్వాలని మేయర్‌ అధికారులను ఆదేశించారు. నగరంలో కుక్కలు, పందుల బెడదపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేయగా..‘చర్యలు తీసుకుంటున్నాం’అనే రొటీన్‌ సమాధానమే అధికారుల నుంచి వచ్చింది.

స్నేక్‌ క్యాచర్‌ను సస్పెండ్‌ చేయండి

పాములు పట్టే రొక్కం కిరణ్‌ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఓ సభ్యుడు ఫిర్యాదు చేయగా.. అలాంటప్పుడు అతనికి మనమెందుకు జీతం ఇవ్వాలని మేయర్‌ అన్నారు. వెంటనే అతన్ని సస్పెండ్‌ చేయా లని ఆదేశించారు. ఏ జోన్‌కు సంబంధించి ఆ జోన్‌లో స్నేక్‌ క్యాచర్‌లను నియమించాలని సూచించారు.

డ్రమ్ములు ఏమయ్యాయి?

సింహగిరి ప్రదక్షిణకు సంబంధించి జూలై 9, 10 తేదీల్లో 120 లీటర్ల కెపాసిటీ గల 300 వాటర్‌ డ్రమ్ములు.. ఒక్కో డ్రమ్ము రూ.1,200 చొప్పున రూ.3,60,000లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ డ్రమ్ములు ఏమయ్యాయని సభ్యులు నిలదీయగా.. పూర్తి వివరాలివ్వాలని మేయర్‌ ఆదేశించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా డ్రోన్‌ ఆపరేటర్‌కు గౌరవ వేతనం(గతేడాది అక్టోబర్‌ 7 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 6 వరకు) నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించే అంశంపై సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందించారు. ఏడాదిగా జీతం ఇవ్వని డ్రోన్‌ ఆపరేటర్‌ అసలు ఉన్నాడా? లేడా? అని అధికారులను ప్రశ్నించారు. ఏడాది జీతం(నెలకు రూ.25వేలు) ఒకేసారి చెల్లించే ప్రతిపాదనపై ఆమె సందేహాలు లేవనెత్తారు.

కేర్‌ టేకర్లకు జీతాల కట్‌

గాజువాక జోన్‌ 64వ వార్డు గంగవరంలో 11 సులభ్‌ కాంప్లెక్స్‌ల్లో పని చేస్తున్న 22 మంది కేర్‌ టేకర్లకు జీతభత్యాలు చెల్లించే విషయమై మేయర్‌ స్పందించారు. అక్కడ వారికి జీతాలిస్తే.. మిగిలిన 98 వార్డుల్లో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌ కేర్‌టేకర్లందరికీ ఇవ్వాలి. ఇక నుంచి సులభ్‌ కాంప్లెక్స్‌ కేర్‌ టేకర్లకు జీతాలిచ్చేది లేదని మేయర్‌ స్పష్టం చేశారు.

అదనపు కార్మికులపై అభ్యంతరం

డిప్యూటీ మేయర్‌ వార్డు(64)కు అదనంగా 15 మంది పారిశుధ్య కార్మికుల నియామకంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులకు అదనపు సిబ్బంది అవసరం ఉందని.. ఆ ఒక్క వార్డులోనే 15 మందిని అదనంగా నియమిస్తే.. మా పరిస్థితి ఏంటని మేయర్‌ను ప్రశ్నించారు. మీరు కూడా కమిషనర్‌కు లేఖ పెట్టండి. కమిషనర్‌ ఓకే అంటే స్థాయీ సంఘం వద్దకు వస్తుందని మేయర్‌ బదులిస్తూనే.. వారిని 15 రోజులు వేరే జోన్‌లో పనిచేయించి, పని తీరు చూశాక నిర్ణయిద్దామన్నారు. జోన్‌–8లో ఏరియా సిల్ట్‌, చెట్ల కొమ్మలు తొలగించేందుకు కనకమహాలక్ష్మి టిప్పర్‌ ట్రాన్స్‌పోర్టుకు ఒక పొక్లెయిన్‌కు రోజుకి 8 గంటలు చొప్పున, గంటకు రూ.1,400 చెల్లించే విషయంపై మేయర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీకి వాహనాలు ఉండగా, అదనంగా ప్రైవేట్‌ వాహనాలు ఎందుకు పెడతున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. మొత్తంగా 217 అంశాల్లో 4 వాయిదా వేసి.. 213 అంశాలకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. కేవలం 130 నిమిషాల్లో 217 అంశాలను చదివి.. 213 అంశాలను చర్చించి ఎలా ఆమోదించారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement