
మరో 1,200 మంది తొలగింపునకు చర్యలు?
స్టీల్‌ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో 13,500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసేవారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ముందుకు రావడంతో దఫదఫాలుగా తొలగిస్తున్నారు. ఉక్కులో మొదటిసారి 1,503 మందిని తొలగించిన యాజమాన్యం రెండోసారి 1,600 మందిని తొలగించింది. అప్పుడప్పుడు పది మంది.. ఇరవై మంది చొప్పున సుమారు 550 మందిని ఇంటికి పంపించేసింది. తాజాగా దీపావళి రోజు మరో 500 మందిని తొలగించింది. ఈ తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మరో 1,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తారని తెలుస్తోంది. వీరుగాక టెండర్లు పూర్తవడంతో సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు పనికోల్పోయారు. టెండరు పూర్తయిన కాంట్రాక్టర్‌కు రీ టెండర్ ఇవ్వకపోవడంతో వారి వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.