
అన్నయ్య కంటే బాబు ఎక్కువయ్యారా?
చిరంజీవిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు స్పందించడంలో పవన్ మౌనం ఎందుకు? ప్రశ్నించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
బీచ్‌రోడ్డు: అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. సొంత అన్నయ్యను వాడు.. వీడు అంటూ బాలకృష్ణ చులకనగా మాట్లాడినా పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంలో మర్మమేంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి, బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. 15 నెలల కూటమి పాలనలో ప్రజాప్రతినిధులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, పాలనను గాలికొదిలేసి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తితో అమర్యాదకరంగా మాట్లాడించి సభా ప్రతిష్టకు భంగం కలిగించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వీధి రౌడీలా చొక్కా గుండీలు విప్పుకుని, నెత్తి మీద కళ్లజోడు పెట్టుకుని, రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, చిరంజీవిని కించపరిచేలా మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు.’అని అన్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ సైతం బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించారే తప్ప ఒక్కరూ ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఆయనకు అన్నయ్య కంటే చంద్రబాబే ముఖ్యమైనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా నడుచుకోవాలని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, చిరంజీవికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జి అంబటి శైలేష్, ముఖ్యనేతలు దొడ్డి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్, కనకాల ఈశ్వరరావు, మువ్వల సంతోష్, తాడి రవితేజ, రవి కుమార్ రెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు ముత్తి సునీల్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, సనపల రవీంద్ర భరత్, ఎస్.ప్రసాదరావు, జీలకర్ర నాగేంద్ర, మార్కండేయులు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, వార్డు అధ్యక్షులు చిల్లింగి నాగేశ్వర్ రావు, ఉమ్మడి కల్యాణ్, రాష్ట్ర, జిల్లా, నాయకులు ప్రగడ జాన్, సంపంగి సురేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.