
AIతో చెక్
ఈపీడీసీఎల్ వినూత్న ఆలోచనలు
సాంకేతికత దన్నుతో విద్యుత్ వ్యవస్థలో లోపాల సవరణ
ఇప్పటికే ఫ్రంట్ లైన్ కార్యకలాపాల్లో ఏఐ వినియోగం
విద్యుత్ స్తంభాల్లో లోపాల్ని స్మార్ట్‌ఫోన్ కెమేరాతో పసిగట్టేలా వ్యవస్థ
విద్యుత్ డిమాండ్‌ని ఇట్టే పసిగట్టే ఏఐ సాంకేతికత
విద్యుత్ లోపాలకు
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వ్యవస్థలో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, ఏపీఈపీడీసీఎల్ సరికొత్త ఆవిష్కరణలను చేపడుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును వినియోగిస్తోంది. విద్యుత్ సరఫరా, స్తంభాల లోపాలు, డిమాండ్ అంచనా వంటి కార్యకలాపాల్లో ఏపీఈపీడీసీఎల్ ఇప్పటికే ఏఐని ఉపయోగిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, క్షేత్రస్థాయి సమస్యలను కనిపెట్టడానికి కూడా ఈ సాంకేతికతను ఉపయోగిస్తోంది.
ఏఐతో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం
కొద్ది నెలలుగా ఏపీఈపీడీసీఎల్ తమ ఫ్రంట్‌లైన్ కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించింది. విద్యుత్ వ్యవస్థకు ఏఐ సాంకేతికతను అనుసంధానించడం వల్ల సమస్యల పరిష్కారం మరింత సులభమైంది. ఈ కొత్త వ్యవస్థను ఏపీఈపీడీసీఎల్ ఐటీ ఇంజినీర్లు, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, బెంగళూరుకు చెందిన జోనాయిక్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఏడాది మార్చిలో ఏపీఈపీడీసీఎల్ డేటా సెంటర్‌లో ఒక ఏఐ సర్వర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి, విద్యుత్ సరఫరాలో లోపాలను సరికొత్త సాంకేతికతతో పరిష్కరించే ప్రయోగాల్లో విజయం సాధించారు.
స్మార్ట్‌ఫోన్ కెమెరాతో స్తంభాల లోపాలు కూడా
జోనాయిక్ స్టార్టప్ సంస్థ సీఈవో శశాంక్ చిలంకుర్తి మార్గదర్శకత్వంలో విద్యార్థులు జీపీయూ ప్రోగ్రామింగ్, ఏఐ వర్క్‌ఫ్లో ఫ్రేమ్‌వర్క్‌పై శిక్షణ పొందారు. అలాగే, ఏపీఈపీడీసీఎల్ ఐటీ టీమ్‌ను కూడా వాన్ శ్రీనివాస్ సుశిక్షితుల్ని చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తిందో లైన్‌మెన్ల సహకారంతో ఏఐ ద్వారా గుర్తించడంలో 100 శాతం విజయం సాధించారు. పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రిడ్స్ వద్ద ఎక్కడైనా లోపం ఉంటే, స్మార్ట్‌ఫోన్ కెమెరా ఉపయోగించి క్షణాల్లో కనిపెట్టే వ్యవస్థను రూపొందించారు. ఇన్సులేటర్లకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉన్నా వెంటనే ఏఐ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఈ స్టార్టప్ సంస్థ, ఏపీఈపీడీసీఎల్ కోసం ఒక ప్రైవేట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోడ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా విద్యుత్ సరఫరాలో లోపాలను ముందుగానే అంచనా వేసి, సంబంధిత ఆపరేటర్లకు సమాచారం చేరవేస్తుంది. ఈ వ్యవస్థ వల్ల సరఫరాలో లోపాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మీటర్ల లోపాలను కూడా పసిగట్టే ఏఐ
స్మార్ట్ మీటర్ల డేటాను అంచనా వేయడానికి కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ డేటా సహాయంతో తప్పుడు రీడింగ్‌లు నమోదు చేస్తున్న మీటర్లను సులభంగా పసిగట్టవచ్చు. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్‌కు కలిగే ఆదాయ నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు. అంతేకాకుండా, ఏఏ ప్రాంతాల్లో లో–వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో ఏఐ రియల్–టైమ్ మానిటరింగ్, గ్రాఫ్ విశ్లేషణల ద్వారా సమాచారాన్ని అందిస్తోంది.
ఈ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి పటిష్టమైన యాంటీవైరస్ వ్యవస్థను కూడా రూపొందించారు. స్మార్ట్ మీటర్లు, ఫీడర్ నిర్వహణ, విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి సేకరించిన డేటాను ఏకీకృత డేటా లేక్ వ్యవస్థలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది ఓవర్‌లోడ్‌లను ముందుగానే గుర్తించడాన్ని మరింత సులభతరం చేసింది.
పోల్ నుంచి..
డిమాండ్ సరఫరా వరకూ..
రాష్ట్ర స్థాయిలో దీర్ఘకాలిక డిమాండ్ అంచనా, సామర్థ్య ప్రణాళికల కోసం ఇప్పటికే ఈపీడీసీఎల్ పరిధిలో ఏఐని విజయవంతంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళిక, ఖర్చుల్ని ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాం. స్మార్ట్‌మీటర్ ఇంటిగ్రేషన్‌తో ఇప్పుడు ఫీడర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ స్థాయిలో స్థానికంగా డిమాండ్ అంచనాల్ని కూడా కనుగొనే సాంకేతికతని అందిపుచ్చుకున్నాం. ఓవర్‌లోడ్‌ని ముందుగానే గుర్తించడం, సకాలంలో లోడ్ షిఫ్టింగ్ మొదలైన అంశాలపై మరింత చురుగ్గా వ్యవహరించేలా ఈపీడీసీఎల్ నిరంతరం సేవలందించేందుకు సిద్ధమైంది. ఏఐ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరగడంతో పాటు.. సిబ్బందికి.. లోపాలు పరిష్కరించే మార్గాలు మరింత సులువవుతుండటం శుభపరిణామం.
– పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ

AIతో చెక్