
పనిభారం, వేధింపులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గగ్గోలు
నిరంతర సర్వేలతో సతమతం
పదోన్నతులకు నోచుకోని వైనం
సమ్మె బాటలో సచివాలయ సిబ్బంది
మహారాణిపేట : సచివాలయ వ్యవస్థ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. కానీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిఒత్తిడి, అసంబద్ధమైన టార్గెట్లు ఈ వ్యవస్థ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చాలనే గొప్ప లక్ష్యంతో 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు 29 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 540 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ‘మీ సేవ’ కేంద్రాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మారిన సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చాక తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు.
జాబ్ చార్ట్‌కు మించిన పనులు
గతంలో సచివాలయ ఉద్యోగులు తమ జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అదనపు పనుల భారం పెరిగిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సర్వేను సచివాలయ ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. గతంలో వలంటీర్లు నిర్వహించిన పనులను కూడా ఇప్పుడు వీరే చూసుకోవాల్సి వస్తోంది.
అధికారుల వేధింపులు, టార్గెట్ల ఒత్తిడి
దిగువ స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు సచివాలయ ఉద్యోగులను టార్గెట్లతో వేధిస్తున్నారని జిల్లా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జాబ్ చార్ట్‌కు సంబంధం లేని పనులను అప్పగించి, ప్రోగ్రెస్ పేరుతో ఒత్తిడి చేస్తున్నారు. వార్డు పరిపాలన కార్యదర్శులకు ఒకవైపు జియో ట్యాగింగ్ టార్గెట్లు ఇస్తూనే, మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని బలవంతం చేస్తున్నారు. ఈ వసూళ్లను పెంచాలని తరచూ సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇలాంటి నిరంతర ఒత్తిడి వల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటోందని, మానసిక ఒత్తిడి వారిని కుంగదీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి, ఉద్యోగుల జాబ్ చార్ట్‌కు అనుగుణంగా మాత్రమే పనులు అప్పగించాలి. పనిభారాన్ని తగ్గించి, మానసిక ప్రశాంతతను కల్పించగలిగితేనే సచివాలయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. లేకపోతే ‘ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అనే నినాదం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది.
ఆందోళనకు సన్నాహాలు
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పెరుగుతున్న పనిఒత్తిడి తగ్గించాలి. అసంబద్ధమైన టార్గెట్లు విధించడం మానుకోవాలి. అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలి. ఉద్యోగుల సమస్యలపై అనేక సార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించాం. స్పందన లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
– పి.వి.కిరణ్‌కుమార్ యాదవ్,
ఉపాధ్యక్షుడు,
గ్రామ వార్డు సచివాలయం
ఎంప్లాయీస్ ఫెడరేషన్
ప్రధాన సమస్యలు
ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీకి వెళ్లాలి. రాత్రి 6.30 గంటల తర్వాత కూడా అధికారులు సమావేశాలు నిర్వహించి గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. సెలవు రోజుల్లో కూడా వీరికి విశ్రాంతి లేకుండా పనులు అప్పగిస్తున్నారు.
ఓడీఎఫ్ సర్వే (బాత్రూమ్‌ల ఫొటోలు), ఆర్‌డబ్ల్యూఎస్ పల్స్ సర్వే (కుళాయిల ఫొటోలు), పీ–4 సర్వే, పేదరిక నిర్మూలన సర్వే, విజన్ 2047 సర్వే వంటి అనేక రకాల సర్వేలు వీరిపై భారాన్ని పెంచుతున్నాయి.
ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడం, స్టిక్కర్లు అంటించడం, హౌస్ టూ హౌస్ జియో ట్యాగింగ్ లాంటి అదనపు పనులు వీరిని మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
సమ్మె నోటీసు ఇచ్చాం
సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఇప్పుటికే పలు రకాల ఉద్యమాలు చేశాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు నోటీసులు ఇచ్చాం. ఐదేళ్ల సర్వీసు పూర్తయినా ఇప్పటి వరకు పదోన్నతులు కల్పించలేదు. 15 రోజుల వ్యవధిలో సమస్యలను పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం.
– పి.జె.గణేష్ కుమార్,
రాష్ట్ర జేఏసీ డీప్యూటీ జనరల్ సెక్రటరీ
ఏపీ విలేజ్ వార్డు సెక్రటేరియట్ జేఏసీ

పనిభారం, వేధింపులు

పనిభారం, వేధింపులు