
ఖుషీ పుట్టిన 13 నెలల వరకు
స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో 17 నెలల చిన్నారి పోరాటం
వైద్యం కోసం రూ.9కోట్లకుపైనే అవసరమని తేల్చిన వైద్యులు
జోల్జెన్మ్సా అనే ఒక్క ఇంజెక్షన్‌తో ప్రాణం నిలబడే అవకాశం
ప్రభుత్వమే ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారి ఇంట్లో సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 17 నెలల చిన్నారి ఖుషీని ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ(ఎస్‌ఎంఏ) టైప్–2’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కబళిస్తోంది. కండరాల కదలికలను స్తంభింపజేసే ఈ మహమ్మారి కారణంగా, ఆ చిన్నారి నడవలేని, కనీసం నిలబడలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకూ క్షీణిస్తున్న తన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.
విషమంగా చిన్నారి ఆరోగ్యం
నగరానికి చెందిన డి.తరుణ్‌కుమార్, ఉషారాణి దంపతులకు రెండేళ్ల కిందట వివాహం కాగా.. ఖుషీ జన్మించింది. తరుణ్‌కుమార్ ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సాధారణ ఉద్యోగి. భార్య గృహిణి. ఎటువంటి ఆస్తుల్లేవ్. కాగా.. తమ గారాలపట్టి ఖుషీ పుట్టిన 13 నెలల వరకు వారి జీవితం ఆనందంగానే సాగింది. కానీ ఉన్నట్టుండి పాప తినడం, ఆడుకోవడం మానేసింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆరిలోవ హెల్త్‌సిటీలోని వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. పాప ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్–2’ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
కన్నీటి సంద్రంలో తల్లిదండ్రులు
ఈ వ్యాధికి చికిత్స ఉందని వైద్యులు చెప్పగానే ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆశ మెరిసింది. కానీ.. దానికి అయ్యే ఖర్చు అక్షరాలా రూ.9 కోట్లు అని తెలియగానే వారి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. జోల్జెన్మ్సా అనే ఒక్కసారి ఇచ్చే జన్యు చికిత్స ఇంజక్షన్‌తో పాపను బతికించుకోవచ్చని, అయితే అది తక్షణమే అందించాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి పాపకు వైద్యం అందిస్తున్న ఆ మధ్యతరగతి కుటుంబానికి రూ.9 కోట్లకు పైనే సమకూర్చడం అనేది ఊహకు కూడా అందని విషయం. బిడ్డను ఎలా బతికించుకోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
ప్రభుత్వం, దాతలే ఆధారం
‘మా లాంటి వాళ్లకు ఇన్ని కోట్లు తేవడం ఎలా సాధ్యం? మా బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వమే చొరవ చూపాలి. విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు మా గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలి.’ అని చిన్నారి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ‘మా పాప మళ్లీ నవ్వాలంటే, మాతో ఆడుకోవాలంటే దాతలు కరుణించాలి. మీరందించే చిన్న సాయం కూడా మా బిడ్డకు ప్రాణం పోస్తుంది.’ అంటూ వారు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు 73067 16745 నంబరులో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. దాతలు, ప్రభుత్వం సహకరిస్తే ఆ పసిమొగ్గ జీవితంలో మళ్లీ ‘ఖుషీ’ నింపవచ్చు.

ప్రసుత్తం ఇలా..