
భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
డాబాగార్డెన్స్ : విశాఖ వేదికగా వచ్చే నవంబర్‌లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. భాగస్వామ్య సదస్సు నిర్వహించే ఏయూ గ్రౌండ్ ప్రధాన వేదిక, ఇతర ప్రాంతాలను కమిషనర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సదస్సుకు ఎంతో మంది అతిథులు తరలిరానున్నారని, అందుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలపై గ్రీన్ మ్యాట్‌లు కప్పేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావును ఆదేశించారు. నగర సుందరీకరణలో భాగంగా సెంటర్ మీడియన్లలో పచ్చదనం, చెట్ల ట్రిమ్మింగ్, ఏయూ గ్రౌండ్ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి, ఆ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి పరచాలని డీడీహెచ్ దామోదరరావును ఆదేశించారు. ఇంజనీరింగ్ పనుల్లో భాగంగా 26 స్ట్రెచ్ ప్రాంతాల్లో దృష్టి సారించి, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, పెయింటింగ్, లైటింగ్ వంటి అభివృద్ధి పనులకు సంబంధించి నివేదిక సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజును ఆదేశించారు. సదస్సు జరిగే వరకూ అధికారులతో ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ సమన్వయ పనులపై దృష్టి సారించాలని అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మను ఆదేశించారు. సదస్సుకు నిర్వహించే పనుల్లో యూఐఎంఎల్ ప్రతినిధి చేతన్‌ను భాగస్వామ్యం చేయాలని ప్రధాన ఇంజనీర్‌కు సూచించారు. పారిశుధ్య నిర్వహణకు పిన్ పాయింట్ వారీగా కార్మికులను సర్దుబాటు, తదితర అంశాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో జోనల్ కమిషనర్లు కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్‌కుమార్, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్, సుధాకర్, ఏసీపీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్