
ఇటుకతో మోది వృద్ధుడి దారుణ హత్య
గోపాలపట్నం: యల్లపువానిపాలేనికి చెందిన వృద్ధుడిని మతిస్థిమితం లేని యువకుడు ఇటుకతో మోది హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యల్లపువానిపాలెం నుంచి విమాన్‌నగర్‌కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. భీశెట్టి పరదేశి(79) మంగళవారం తన పశువులను మేత కోసం సమీపంలోని రైల్వే ట్రాక్ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పశువులను చూసేందుకు వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన అలమండ నితీష్ ఆ ప్రాంతానికి వచ్చాడు. నితీష్ ఒక్కసారిగా పరదేశిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు కేకలు వేసి వారించేందుకు ప్రయత్నించినా, అతను పట్టించుకోలేదు. దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. వృద్ధుడిని కింద పడేసి, ఇటుకతో తలపై మోదడంతో పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐలు అప్పలనాయుడు, రామారావు వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలను సేకరించింది. నిందితుడు నితీష్‌కు మతిస్థిమితం లేదని, గత ఏడాది మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పరదేశికి కుమారుడు ఈశ్వరరావు ఉన్నారు. తన తండ్రి గేదెలను నిందితుడి ఇంటి ముందు నుంచి తీసుకెళ్తుంటే, నితీష్ గొడవ పడేవాడని, ఆ కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని పరదేశి కుమారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటుకతో మోది వృద్ధుడి దారుణ హత్య