
కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
మహారాణిపేట: కేజీహెచ్‌లో అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగింది. జన్యుపరమైన సమస్యలతో తల వెనుక భాగంలో పెద్ద గడ్డతో జన్మించిన నవజాత శిశువుకు వైద్యులు ప్రాణం పోశారు. ఈ శిశువు ప్రస్తుతం క్షేమంగా కోలుకుని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జూలై 31న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణి వండలం సత్యవతిని ఆమె భర్త శ్రీనివాస్ గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ఆగస్టు 1న ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. పుట్టుకతోనే శిశువు తల వెనుక పెద్ద గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు పంపించారు. అదే రోజు శిశువును కేజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు శిశువుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా.. అది ‘జెయింట్ ఆక్సిపిటల్ మెనింగో ఎన్సెఫలోసిల్’ అనే అరుదైన గడ్డ అని గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 6న న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమజీత్ రే ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. బయటకు వచ్చిన మెదడు భాగాన్ని వైద్యులు జాగ్రత్తగా తొలగించి, తల భాగాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ ప్రేమజీత్ రే తెలిపారు. ఇలాంటి వ్యాధి పదివేల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్ తెలిపారు. సాధారణంగా ఇలాంటి శిశువులు పుట్టిన వెంటనే లేదా శస్త్రచికిత్స తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని, అయితే భవిష్యత్తులో ‘హైడ్రోసెఫలస్’ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నా రు. అందువల్ల ప్రతి నెలా న్యూరో సర్జరీ అవుట్ పేషెంట్ విభాగానికి తప్పకుండా రావాలని ఆ బిడ్డ తల్లిదండ్రులకు సూచించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.రాధాకృష్ణన్, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి తదితరులు అభినందించారు.
తల వెనుక భాగంలో పెద్ద గడ్డతో పుట్టిన
నవజాత శిశువు
నవజాత శిశువు తల వెనుక భాగంలోని గడ్డను తొలగించిన తర్వాత..
నవజాత శిశువుకు ప్రాణం పోసిన వైద్యులు

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స