
బకాయిలు చెల్లించాలని టీచర్ల ధర్నా
మహారాణిపేట: తమకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, మధ్యంతర భృతి ఇవ్వాలని ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో ‘నిరసన వారం’లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ నిరసనకు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.కరుణాకరరావు, ప్రధాన కార్యదర్శి టి.రామకృష్ణారావు నాయకత్వం వహించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ‘అసెస్‌మెంట్ పుస్తకం’పై సమీక్ష జరపాలని, సీపీఎస్‌ను రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కరుణాకరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా సంపాదిత సెలవు బిల్లు లు, బీమా పథకాల మెచ్యూరిటీ మొత్తాలు, భవిష్య నిధి ఫైనల్ సెటిల్‌మెంట్లు, గ్రాట్యుటీ మొత్తాలు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రామకృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో భవానీ శంకర్‌కు అందజేశారు. ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కొటాన శ్రీనివాసు, బొబ్బిలి ముత్యాల నాయుడు, బి.డి.కె.కుమారి పాల్గొన్నారు.