
తమ పిల్లలను ఆదుకోవాలి
మహారాణిపేట: డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ)అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లలను ఆదుకోవాలని కోరుతూ పలువురు తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, బంధువులు డీఆర్‌వో భవాని శంకర్‌కు సమస్యను వివరించారు. డీఎండీ వ్యాధి వల్ల గుండె కండరాలు బలహీనపడతాయని, క్రమంగా పరిస్థితి క్లిష్టంగా మారుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ న్యూరో–మస్కులర్ జెనిటిక్ వ్యాధి సాధారణంగా అబ్బాయిల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. తమ పిల్లలకు ప్రత్యేక చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత పిల్లలు రితీష్, మౌనిక, భావన, హర్ష, షన్వీక్‌లతో పాటు వారి తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు.