
ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆందోళన
మహారాణిపేట: జీవీఎంసీ పరిధిలోని 51వ వార్డు మాధవధార సర్వే నంబర్ 9లో ఉన్న ప్రభుత్వ భూమిని జిరాయితీగా చూపిస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ అక్రమాలకు సహకరించిన జీవీఎంసీ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 9లోని ప్రభుత్వ భూమిని ఉపయోగించుకొని కబ్జాదారులు కోర్టుల్లో భూ హక్కులు పొందేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. దీంతో పాటు మురికివాడల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మురికివాడలను నోటిఫై చేయాలని, జీవో నంబర్ 30 ప్రకారం పేదల నివాసాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మురికివాడల ముఖచిత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మురికివాడల కోసం ఉద్దేశించిన చట్టాలు, పథకాలు, జీవోలు ఏవీ అమలు కావడం లేదని తెలిపారు. మురికివాడల అభివృద్ధికి కేటాయించిన 40 శాతం నిధుల్లో ఒక్క శాతం కూడా ఖర్చు చేయడం లేదని, ప్రాథమిక వసతులైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటివి కూడా కల్పించడం లేదన్నారు. ఇటీవల ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న తాటిచెట్లపాలెం, ఏఎస్‌ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లకు అధిక పన్నులు వేశారని, అవి పేదల స్థాయికి మించి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు తగ్గించమని కోరితే, అవి నోటిఫై చేసిన మురికివాడలు కాదని అధికారులు చెబుతున్నారని, అయితే నోటిఫై చేయాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం కన్వీనర్ ఈ.లక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అరుణోదయ సంఘం జిల్లా కన్వీనర్ రామకృష్ణ, ఎంఎంఎస్‌ఎస్ పూర్వ అధ్యక్షుడు కె.రవి, జిల్లా నాయకులు కె.అప్పారావు, పరదేశి, అప్పన్న, వీర్రాజు, జయమ్మ, రోహిణి తదితరులు పాల్గొన్నారు.